సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనంటూ జరిగితే అన్ని ప్రాంతాలవారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్షకు వస్తున్న మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. విజయమ్మకు అండగా.. పలు జిల్లాల నుంచి జనం సమైక్యంగా కదులుతున్నారు. భారీ ర్యాలీలతో, పాదయాత్రలతో సమర దీక్షకు తరలివస్తున్నారు. కొందరు తమ ప్రాంతాల్లోనే విజయమ్మకు మద్దతుగా రిలే దీక్షలు, ఆమరణ దీక్షలు చేపడుతున్నారు.
సమన్యాయం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు జాతికి ద్రోహం చేస్తుంటే.. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తోందంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరులకు నిరసనగా నినాదాలు చేస్తున్నారు. వై.ఎస్.విజయమ్మ గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు శుక్రవారంతో ఐదు రోజులు పూర్తయ్యాయి. ఓ వైపు ఆరోగ్యం క్షీణిస్తున్నా, లెక్కచేయకుండా మొక్కవోని పట్టుదలతో ఆమె కొనసాగిస్తున్న దీక్షను అన్ని వర్గాల వారూ అభినందిస్తున్నారు. కేవలం సీమాంధ్ర జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా మహిళలు శుక్రవారం దీక్షకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కూర్చోలేని స్థితిలో విజయమ్మ
సుగర్, బీపీ లెవల్స్ సాధారణ స్థాయి కంటే గణనీయంగా తగ్గడంతో విజయమ్మ శుక్రవారం పూర్తిగా నీరసంగా కనిపించారు. కూర్చోలేని స్థితిలోఆమె దీక్షా వేదికపై ఎక్కువ సేపు పడుకున్నారు. ఓ వైపు పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ శ్రేణులు, సమైక్యవాదులు గుంటూరుకు చేరుకుని దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఆమెను చూసేందుకు బారులు తీరారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పలు దఫాలుగా విజయమ్మకు పరీక్షలు జరిపి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పల్స్ రేటు పడిపోవడంతో విజయమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినప్పటికీ పట్టువదలని విజయమ్మ అకుంఠిత దీక్ష చూసిన రాజకీయ విశ్లేషకులు, సమైక్యాంధ్రను కాంక్షించే మేధావులు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధిపై వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధిని అభినందిస్తున్నారు.
కంటతడి పెడుతున్న జనం
దీక్ష ప్రారంభించి ఐదు రోజులు కావడంతో బాగా నీరసపడిన విజయమ్మను చూసి శిబిరంలో మహిళలు, వృద్ధులు కంటతడి పెట్టుకున్నారు. ఎవరికి వారు ఆమెను చూసేందుకు క్యూలో ముందుకు కదుల్తూనే ‘దేవుడా.. ఆ మహాతల్లికి ఏమీ జరగకుండా దీవించయ్యా..’ అంటూ వేడుకొన్నారు. ఒక్కొక్కరూ చేతులెత్తి నమస్కరిస్తూనే పూర్తిగా నీరసపడిన విజయమ్మను చూసి తట్టుకోలేక భావోద్వేగానికి లోనయ్యారు. వృద్ధులైతే అక్కడే ఏడ్చారు.
జనాల ఒత్తిడిలోనూ చంటిబిడ్డలను భుజాలకెత్తుకుని ఆమెకు అభివాదం చేయించారు. శుక్రవారం దీక్షకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు ఖమ్మంకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏలూరుకు చెందిన పసుపులేటి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘ మహిళలంతా తరలివచ్చారు. కర్నూలు నగరానికి చెందిన వృద్ధురాలు ఒకరు.. జూనియర్ ఇంటర్ చదువుతున్న తన మనుమరాలిని తోడుగా తెచ్చుకుని మరీ విజయమ్మను చూసేందుకు వచ్చానని చెప్పింది. ఆమె చేస్తున్న దీక్ష వృథాకానివ్వమని.. రాష్ట్ర ప్రజలకు పూర్తిన్యాయం జరిగేంతవరకు విజయమ్మకు మహిళాలోకమంతా బాసటగా నిలుస్తుందని ఘంటాపథంగా చెప్పింది.
ఆకట్టుకుంటున్న ప్రసంగాలు
దీక్షలో పాల్గొంటున్న వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, పొలిటికల్ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు.. విభజనతో జరిగే నష్టాల్ని సోదాహరణగా వివరిస్తూ చేస్తున్న ప్రసంగాలను జనం ఆసక్తిగా వింటున్నారు. సాగు, తాగునీటి కష్టాలు, హైదరాబాద్‌లో ఉద్యోగాలపై నేతలు చేస్తున్న ప్రసంగాలు ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు దీక్షా వేదిక వద్దకు చేరుకుని విజయమ్మ దీక్షకు అండగా ఉంటామని ప్రతినబూనుతున్నారు.
‘‘కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన ప్రక్రియపై తీసుకున్న నిర్ణయంతో మా భవిష్యత్తు అంధకారంగా మారడమేనా?’’ అని దీక్షా వేదిక వద్ద విజయమ్మను చూసేందుకు వచ్చిన ఉప్పలపాడుకు చెందిన ఇంటర్ విద్యార్థిని పద్మశ్రీ ప్రశ్నించింది. ఇప్పటికే సాగు నీరందక కరువుతో అల్లాడుతున్నామని, ఫ్లోరైడ్‌తో బాధ పడుతూ తాగునీటి కష్టాలు పడుతున్న తమకు ఈ విభజనతో చుక్క నీరు కూడా రాదని, ఏం పంటలు పండించుకోవాలో అర్థం కావడం లేదని ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం పెద్ద చెర్లోపల్లికి చెందిన రైతు కాకర్ల పెద్ద మస్తాన్ వాపోయారు.
గుంటూరులో భారీ ర్యాలీ
విజయమ్మ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, పెదకూరపాడు, తాడికొండ, గుంటూరు నగరం, రూరల్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో లాడ్జి సెంటర్ నుంచి ఆర్టీసీ డిపో వద్ద ఉన్న దీక్షా వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా తరలివచ్చిన జనంతో నగరంలో లాడ్జి సెంటర్, శంకర్‌విలాస్, ఫ్లై ఓవర్, హిందూ కళాశాల కూడలి, మార్కెట్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి.
విజయమ్మకు అండా దండా
Published Sat, Aug 24 2013 3:32 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement