‘సమైక్యం’కోసం సమ్మెబాట | Seemandhra Teachers Strike for United Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘సమైక్యం’కోసం సమ్మెబాట

Published Thu, Aug 22 2013 2:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Seemandhra Teachers Strike for United Andhra Pradesh

* బుధవారం అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయుల సమ్మె  
* రేపు అర్ధరాత్రి నుంచి గెజిటెడ్ ఉద్యోగుల సమ్మె
* గుంటూరులో జరిగిన సీమాంధ్రలోని 13 జిల్లాల అధికారుల భేటీలో నిర్ణయం
* నేడు సీఎస్‌కు సమ్మె నోటీసు
* సమ్మెలోకి 56 ప్రభుత్వ శాఖల అధికారులు
* సీఎస్‌కు సమ్మె నోటీసిచ్చిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు
* డిమాండ్ పరిష్కారానికి సెప్టెంబర్ 2 వరకు గడువు
* లేదంటే అదే రోజు అర్ధరాత్రి నుంచి  నిరవధిక సమ్మె
 
సాక్షి, గుంటూరు/ హైదరాబాద్: సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఎన్జీవోల బాటలోనే పలు ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పడుతున్నాయి. సీమాంధ్రలోని 13 జిల్లాల ఉపాధ్యాయులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళుతున్నట్లు గెజిటెడ్ అధికారులు ప్రకటించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వచ్చే నెల రెండో తేదీలోగా వెనక్కి తీసుకోకపోతే అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి నోటీసు అందజేశారు.

సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన 56 ప్రభుత్వ శాఖల ప్రభుత్వ గెజిటెడ్ అధికారులు ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట ఉన్న ఆఫీసర్స్ క్లబ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో నిర్వర్తించాల్సిన పాత్రపై చర్చించుకున్న అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు పిడుగు బాబూరావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామంటూ గత నెల 30న కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం నిర్మితమైందని చెప్పారు.

రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఏపీఎన్జీవో, రెవెన్యూ అసోసియేషన్‌లకు చెందిన అన్ని ప్రభుత్వశాఖలకు చెందిన నాన్-గెజిటెడ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా నిరవధిక సమ్మెలోకి దిగారని వివరించారు. వారికి మద్దతుగా సమైక్యరాష్ట్ర సాధనకోసం గెజిటెడ్ అధికారులుగా తమ వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు నిరవధిక సమ్మెకు సన్నద్ధమయ్యామని తెలిపారు.

ఇప్పటికే సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో అదనపు సంయుక్త కలెక్టర్ల సారధ్యంలో డీఆర్‌వోల అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీల ద్వారా గెజిటెడ్ అధికారులను సమ్మెకు సమాయత్తం చేశామనీ, ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోకుండా చేయడమే తమ లక్ష్యమని వివరించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మినహా ఇతర అధికారులెవ్వరూ ప్రభుత్వ విధుల్లో పాల్గొనే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

వాణిజ్యపన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు వాటిల్లే నష్టం ఊహించజాలమని, ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వానికి వాణిజ్య పన్నులద్వారా ఏటా రూ.42వేల కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో రూ.27వేల కోట్లు ఒక్క హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌తో పాటు అన్నిశాఖల అధిపతులకు గురువారం ఉదయం 11 గంటలకు సమ్మె నోటీసు ఇస్తున్నామని, సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకూ నిరవధిక సమ్మెలోనే ఉంటామని స్పష్టం చేశారు. 13 జిల్లాల నుంచి సమావేశానికి హాజరైన గెజిటెడ్ అధికారులు చేతులు కలిపి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

సమావేశంలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మేకా రవీంద్రబాబు, ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు, కార్యదర్శి ధర్మచంద్రారెడ్డి, సహాయ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, జిల్లా విద్యాశాఖాధికారి డి.ఆంజనేయులు, గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పులిపాక రాణి, కడప డీటీసీ కృష్ణవేణి, భూ పరిపాలన డిప్యూటీ కలెక్టర్ ఎ.ప్రభావతి, జిల్లా రెవెన్యూ అధికారుల సంఘ అధ్యక్షుడు కె.వెంకయ్య, వివిధ జిల్లాల నుంచి వచ్చిన తహశీల్దార్లు, కమిషనర్లు, గెజిటెడ్ అధికారులు పాల్గొన్నారు.

సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె నోటీసు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ  సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతిని కలిసి నోటీసు అందజేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల రెండో తేదీలోగా వెనక్కి తీసుకోవాలని గడువు విధించారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుంటే.. అదే రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని నోటీసులో పేర్కొన్నారు.

సీఎస్‌కు నోటీసు ఇచ్చిన అనంతరం ఫోరం నాయకులు కేవీ కృష్ణయ్య, మురళీమోహన్‌తో కలిసి చైర్మన్ యు.మురళీకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ... తమ డిమాండ్ పరిష్కారమయ్యేంతవరకూ ఎన్ని నెలలైనా సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. తమను వలసవాదులని సంబోధిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె ఎలా చేపడతారని రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై తమ న్యాయవాదులు ధర్మాసనానికి వివరణ ఇస్తారని తెలిపారు.

కొనసాగిన నిరసన
విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కూడా సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి సచివాలయంలో నిరసన కొనసాగించారు. ఎల్ బ్లాక్ వద్ద ధర్నా చేసిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ఎదురుగా బైఠాయించి.. తాము వలసవాదులం కాదని, సమైక్యవాదులమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

నేడు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల రక్తదాన శిబిరం
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలో భాగంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నేడు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో సచివాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సచివాలయ సీమాంధ్ర ఫోరం కార్యదర్శి కె.వి కృష్ణయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement