న్యూఢిల్లీ : రాష్ట్రంలోని తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మళ్లీ హస్తిన బాటపట్టారు. ఇరు ప్రాంతాల నేతలు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత సీమాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనపై వెనకడుగు లేదంటూనే, తమ వాదనలు పార్టీ కమిటీకి వినిపించుకోవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ తెగేసి చెప్తోంది. ఈ పరిస్థితిలో ఏర్పాటైన ఆంటోనీ కమిటీకి తమతమ వాదనలతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.
సీమాంధ్ర ఒత్తిళ్ళకు తలొగ్గి విభజనపై వెనకడుగు వేయవద్దన్న వాదన వినిపించేందుకు తెలంగాణ కాంగ్రెస్ బృందం సన్నద్ధమైంది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి ఎకె ఆంటోని నేతృత్వంలోని పార్టీ కమిటీని టి.కాంగ్రెస్ బృందం కలిసి తమ వాదన వినిపించనుంది. రాత్రి ఎనిమిది గంటలకు ‘వార్ రూం’లో భేటీ జరగబోతోంది. ఇదిలావుంటే, ఆంటోని కమిటీని కలిసిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాలని ఇరు ప్రాంతాల నేతలూ భావిస్తున్నారు. సీమాంధ్రుల అభ్యంతరాలు, సమస్యలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం ఆంటోనీ కమిటీని కలవనున్నారు.
హస్తినకు సీమాంధ్ర, తెలంగాణ నేతలు
Published Mon, Aug 19 2013 10:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement