విభజన వద్దంటూ గవర్నర్‌కు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల సతీమణుల వినతిపత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ముక్కలు చేయడం అప్రజాస్వామికం, అన్యాయం, అనైతికం అని రాష్ట్ర సీమాంధ్ర మంత్రుల భార్యలు మండిపడ్డారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రాన్ని ముక్కలు చేసే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంత్రి సాకే శైలజానాథ్ సతీమణి మోక్షప్రసన్న, మంత్రి పార్థసారథి సతీమణి కమలల నాయకత్వంలో పలువురు మంత్రుల భార్యలు, బంధువులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పించారు.
తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మహారాష్ట, తమిళనాడు, కర్నాటక, ఒడిశా తదితర ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌కు నీటి వివాదాలు ఉన్నాయని, రాష్ట్రాన్ని విడదీస్తే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య కూడా నీటి తగాదాలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌ను అందరం కలిసి అభివ ృద్ధి చేసుకున్నామని, అలాంటిది ఇప్పుడు తమను వెళ్లిపోమంటే ఎక్కడకు వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు విభజన వల్ల పూర్తిగా దెబ్బతింటాయన్నారు. విడిపోతే అందరం నష్టపోతామని, కలిసుంటే అందరం అబివృద్ధి సాధిస్తామని చెప్పారు.
వారితో పాటు రాజ్‌భవన్‌కు వెళ్లిన వైఎస్‌ఆర్‌సీపీ కృష్ణా జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమల మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సోనియా గాంధీకి అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ చెప్పినట్లుగా ప్రతి తుపాకి గుండు ఒక మాతృ హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తుందని, రాష్ట్ర విభజన తమ హృదయాన్ని తీవ్రంగా గాయపరుస్తోందన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత హోదాలో గవర్నర్‌ను కలిశామని, ఇందులో తమ భర్తలకు ఎలాంటి ప్రమేయం లేదని అన్నారు. ఇదే అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలుసుకుని, ఆయనకు కూడా వినతి పత్రం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శత్రుచర్ల సతీమణిశశికళ, టీజీ వెంకటేష్ సతీమణి మంజరి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరి సుచరిత, విప్ రుద్రరాజు పద్మరాజు సతీమణి ఇందిర, వారి బంధువులు సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. వీరంతా రాజ్‌భవన్‌కు మంత్రులు అధికారికంగా వినియోగించే బుగ్గ కార్లలో రావడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల మేరకు బుగ్గకార్లలో కేవలం మంత్రులు మాత్రమే పయనించాలి.
ముక్కలు చేయడం అనైతికం: సీమాంధ్ర మహిళలు
Published Wed, Aug 14 2013 2:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement