రాజకీయ నిర్ణయం మేరకే
ఆంధ్ర కొత్త రాజధాని ఎంపికపై వెంకయ్య వెల్లడి
చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక రాజధానిపై కసరత్తు
కొత్త రాజధానిగా హైదరాబాద్ అంతటి నగరాన్ని ఆశించలేం
{పధాని మోడీ స్మార్ట్ సిటీ ఆలోచనకు హైదరాబాద్ అనువైనది
ఆంధ్ర, తెలంగాణలను కేంద్రం కన్నబిడ్డల్లా ఆదుకుంటుంది
హైదరాబాద్: విభజన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక అన్నది అంతిమంగా అక్కడ ప్రభుత్వంలోకి వచ్చేవారు రాజకీయంగా తీసుకునే నిర్ణయం మేరకే జరుగుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, ఆయన మంత్రివర్గ విస్తరణ తరువాత రాజధానికి సంబంధించి తదుపరి చర్యలు మొదలవుతాయని చెప్పారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వెంకయ్యనాయుడు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా లేక్‌వ్యూ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించి ఇప్పటికే తానొకసారి చంద్రబాబుతోనూ చర్చిం చినట్టు తెలిపారు. కొత్త రాజధాని హైదరాబాద్ అంతటి నగరంగా ఉంటుం దని ఆశించ లేమని.. ఎంత మేరకు అవసరం, ఎలాంటి సౌకర్యాలు కావాలన్నదే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. అలాగని కేవలం అసెంబ్లీ, సచివాలయం, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస గృహాలకు పరిమితమై రాజధాని నగరాన్ని నిర్మిం చడం సరికాదన్నారు. రాజధానిగా ఉండే నగరానికి ఉండాల్సిన మౌలిక వసతులు, మంచినీటి సౌకర్యం వంటి అవసరాలను పరిశీలించి అధికారులు నివేదికలు సిద్ధం చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గుంటూరు-విజయవాడ, ఖాజీపేట-వరంగల్ వంటి జంట నగరాల అభివృద్ధి మంత్రిగా తన ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా చెప్పారు. ప్రధాని మోడీ ఆలోచనల్లోని స్మార్ట్ సిటీ విధానానికి హైదరాబాద్ అనువైనదిగా వెంకయ్య పేర్కొన్నారు. ఈ నగరం చుట్టూ కొన్ని చిన్న నగరాలను అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ఆలోచన ఉందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో పనులు 2017 వరకు పూర్తవుతాయని, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు దీనిని విస్తరించే ఆలోచన ఉందని చెప్పారు.
రెండు రాష్ట్రాలను కన్నబిడ్డల్లా చూసుకుంటాం...
అంతకుముందు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వెంకయ్య.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కేంద్రం కన్నబిడ్డల మాదిరి ఆదుకుంటుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ అభివృద్ధి సాధ్యమని.. ఒకరినొకరు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. ఉద్యోగుల పంపిణీపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిబంధనల మేరకు ఉద్యోగుల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు జరిగిన పంపిణీ తాత్కాలికమైనదని.. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మూడు నెలల్లో తెలియజేసి పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఎక్కడి వారు అక్కడ పనిచేయాలని కొందరు అంటున్నా రెండో ప్రాంతంలో సూపర్ న్యూమరీ పోస్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపితేనే అది సాధ్యమని చెప్పారు.
ఘన స్వాగతం.. అధికారులతో సమీక్ష
కేంద్రమంత్రి పదవి చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన వెంకయ్యకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికి పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆయన బెంగళూరులో ఉన్నందునే ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని పార్టీ నేతలు చెప్పారు.