తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: స్వీయ సంరక్షణ తప్ప ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఏ మందూ లేదు.. మొన్నటి వరకు ఓ ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు.. వానాకాలం ప్రారంభమైంది. జిల్లాలో వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభించేందుకు అనుకూల సమయమిది. అసలే వ్యాధుల సీజన్.. ఆపై కోవిడ్–19 మరింత భయపెడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. నిబంధనలు పాటించకపోయినా మహమ్మారి మనల్ని చుట్టేయడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నాన్నారు.
అసలే వానాకాలం
సాధారణంగానే వానాకాలం అంటే వ్యాధుల సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. కరోనాకు సైతం ఇవే లక్షణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది చిన్నపాటి జలుబు, దగ్గుకు భయపడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి చిన్నగా తుమ్ము, దగ్గు వచ్చినా మిగతా వారు అనుమాన పడుతున్నారు.
బేఖాతర్ చేస్తే అంతే
ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో 20 రోజులుగా చాలా మంది కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారు. సడలింపులతో పాటు జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించినా చాలా మంది పట్టించుకోవడం లేదు. కొంత మంది కనీసం మాస్క్‌లు కూడా ధరించడం మరిచారు. భౌతిక దూరం నిబంధన సైతం కానరావడం లేదు. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో నిబంధనలు పాటించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.
ఇలా వచ్చింది..
జిల్లాలో కరోనా వైరస్ మార్చి 24న అడుగు పెట్టింది. లండన్ వెళ్లి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలు ఉండడంతో ఆయన్ని కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లి పరీక్షల అనంతరం అధికారులు కరోనా పాజిటివ్‌గా ధ్రువీకరించారు. ఆ తరువాత ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తులతో కరోనా కేసులు పెరిగాయి. ఏప్రిల్ 26వ తేదీ వరకు జిల్లాలో ఈ కేసులు క్రమేపీ పెరుగుతూ 31గా నమోదయ్యాయి. వీరిలో దాదాపుగా 17 మంది అప్పటికే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ ఆయ్యారు. తరువాత ఈ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో మే నెలలో జి.మామిడాడకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడు. తర్వాత జి.మామిడాడ, బిక్కవోలు, ఊలపల్లి, రాయవరం, మేడపాడు, రామచంద్రపురం, పెద్దాడ, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, అయినవిల్లిల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. పక్షం రోజుల వ్యవధిలోనే దాదాపు 460కి పైగా కేసులు నమోదవడం గమనార్హం. కొత్త కేసులన్నీ మహారాష్ట్ర, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వలస కార్మికులతో ముడిపడి ఉన్నవే.
నిబంధనలను పట్టించుకోక..
కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ రక్షణే మందు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేసిన సమయంలో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను పెడచెవిన పెడుతూ కొందరు తిరగడంతో కరోనా వ్యాప్తికి కారణమైంది. ముఖానికిమాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, అత్యవసరమైతే మినహా ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం, సమూహాలుగా కాకుండా దూరంగా ఉండటం, వంటి చిన్న జాగ్రత్తలను పాటించినా కరోనాను కట్టడి చేయవచ్చు. ప్రస్తుతం వానాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా ముందు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు కోరుతున్నారు.
భయపడొద్దు.. జాగ్రత్తలే ముద్దు
వానాకాలంలో జ్వరాలు, వివిధ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కరోనాకు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలి. జిల్లా ఆసుపత్రుల్లో నిరంతరం వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనా @ 39
జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 39 మందికి వైరస్ సోకింది. రాయవరం మండలం చెల్లూరు శివారు సూర్యారావుపేటలో మొత్తం 26 కరోనా కేసులు నమోదయ్యాయి. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌లో 4, పెద్దాపురంలో 1, తొండంగి మండలం ఏవీ నగరంలో 1, అయినవిల్లి మండలం ఎన్.పెదపాలెంలో 2, పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లి గ్రామంలో ఒకే కుటుంబంలో నలుగురికి వైరస్ సోకింది. ముంబయి నుంచి రైలులో వచ్చిన నాగుల్లంక శివారు పెదకందాలపాలెం గ్రామానికి చెందిన ఓ బాలికకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment