శ్రీకాకుళం రూరల్: ఫొటోల పిచ్చి పెచ్చుమీరుతుంది. ప్రాణాలు పోగొట్టుకునేవరకు తీసుకెళుతుంది. ఓ అందమైన సెల్ఫీ, ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో పోస్టు చేయాలనుకున్నాడు. చివరకు ఆ ఫొటో వ్యామోహమే అతని ప్రాణాలను బలిగొంది. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి గోవిందనగర్ కాలనీ సమీపంలో రామిగెడ్డలో గెంతుతూ ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలావున్నాయి. శ్రీకాకుళం నగరంలోని పెద్దరెల్లివీధికి చెందిన అరుగుల యువతేజ(17) స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఓకేషనల్ కోర్సు అభ్యసిస్తున్నాడు. రోజూలాగే శనివారం ఉదయం కూడా కళాశాలకు వెళ్లి తన స్నేహితులతో కలిసి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చేశాడు. అక్కడ నుంచి స్నేహితులైన జి.ఢిల్లేశ్వరరావు, పి.జయకృష్ణ, జె.అరుణ్‌తో కలిసి రామిగెడ్డలో స్నానాలు చేసేందుకు సైకిల్‌పై బయలుదేరారు.
వీరిలో కొందరు కల్వర్టు పైనుంచి గెడ్డలో గెంతుతూ స్నానాలు చేస్తుండగా ఒడ్డున ఉన్న ఇంకొక స్నేహితుడు వారికి ఫొటోలు తీస్తున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఇంకొకరు గెడ్డలో గెంతుతూ సెల్ఫీ, ఫొటోల మోజులో పడిపోయారు. అయితే యువతేజ కల్వర్టు పైనుంచి దూకిన వెంటనే గెడ్డ అడుగు భాగాన ఉన్న రాయికి తలవెనుక భాగం ఢీకొట్టింది. ఒక్కసారిగా అపస్మారకస్థితికి చేరుకుని గెడ్డ అడుగు భాగాన ఉండిపోయాడు. యువతేజ కనిపించడం లేదంటూ స్నేహితులంతా గెడ్డపరిసర ప్రాంతంలో వెతకడం ప్రారంభించారు. అయినా అతడి ఆచూకీ కనిపించకపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి వెంకట్రావు తన సిబ్బందితో కలిసి రామిగెడ్డ వద్దకు చేరుకొని యువతేజ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మృతదేహం లభ్యమయింది. ఈ విషయాన్ని వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ వాసునారాయణ సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరాతీసి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
యువతేజ మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న అతని తల్లిదండ్రులు అప్పన్న, తిరుపతమ్మ గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. ముగ్గురు సంతానంలో ఆఖరివాడైన యువతేజ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment