
ఆ భూములు అమ్ముకోవచ్చు...
బోరుపాలెం(తుళ్లూరు) : రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు అంగీకార పత్రాలు ఇచ్చినా రైతులు ఆ భూములు అమ్ముకోవచ్చని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. అయితే ఆ విషయాన్ని స్థానిక భూ సమీకృత అధికారి దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలాలు భూమి కొన్నవారికి దక్కేలా చర్యలు చేపడతారన్నారు. అలాగే ల్యాండ్ పూలింగ్‌కు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వనవసరం లేద న్నారు. ఫొటోస్టాట్ కాపీలు చాలన్నారు.
మండలంలో మూడవ ోజు ఆదివారం కూడా భూ సమీకరణ జరిగింది. బోరుపాలెం, ఐనవోలు గ్రామాల్లో ఉదయం వేళ ల్యాండ్ పూలింగ్ గ్రామ సభలు నిర్వహించారు. స్థానిక శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలసి మంత్రి పి. నారాయణ పాల్గొన్న ఈ సభల్లో మొత్తం 116.66 ఎకరాలను సమీకరించారు. బోరుపాలెంలో 71.46, ఐనవోలులో 39, నేలపాడులో 6.2 ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇస్తూ రైతులు తమ అంగీకార పత్రాలను అందజేశారు.
ముందుగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే మాట్లాడుతూ ఈ గ్రామంలో రాజధానికి భూములు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్న రైతులను అనేక అనుమానాలు తొలుస్తున్నాయని చెప్పారు. నిమ్మతోటలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని, జరీబు భూముల ప్యాకేజీ పెంచాలని కోరుతున్నట్లు వేదికపై ఉన్న మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన మంత్రి నారాయణ రైతులను ఆందోళన పడవద్దన్నారు.
మరోమారు సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి అనుకూలమైన ప్యాకేజీ ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజులపాటు ప్రతి గ్రామంలో రెవెన్యూ బృందాలు రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటాయన్నారు.
ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులు తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి పాస్‌పుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు ఓ అధికారిని నియమించి, టోల్‌ఫ్రీ ఫోన్ నంబర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తహశీల్దార్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కరనాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు, డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, గ్రామ సర్పంచ్ దివ్వెల బాలమ్మ, ఉప సర్పంచ్ నెలకుదిటి నరేంద్రబాబు, నాయకులు బెల్లం కొండ నరసింహారావు, దామినేని శ్రీనివాసరావు, అనుమోలు సత్యనారాయణ, కొమ్మినేని సత్యనారాయణ, వేజండ్ల శివప్రసాద్, నూతలపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఐనవోలులో
ఐనవోలు గ్రామంలో డిప్యూటీ కలెక్టర్, భూసమీకృతఅధికారి ఎన్. ఏసురత్నం ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ గ్రామ సభ జరిగింది. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పోతురాజు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ వలపర్ల జ్ఞానానందం తో పాటు ఉప సర్పంచ్ పాలకాయల అర్జునరావు, పాలకాయల గోపాలరావు, మరో 14 మంది రైతులు 39 ఎకరాల భూములను రాజధాని నిర్మాణానికి ఇస్తూ అంగీకార పత్రాలు సమర్పించారు.
మొత్తం భూములు 1,197.97 ఎకరాలకు గ్రామ కంఠం భూమి 24.04 ఎకరాలు పోనూ 1, 173.93 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసి భూ సమీకరణ చేస్తున్నట్టు ఏసురత్నం తెలియ జేశారు.
స్పందించని అబ్బురాజుపాలెం రైతులు...
మండలంలోని బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాలకు కలిపి ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. బోరుపాలెంలో జరిగిన సభలో ఆ గ్రామ రైతులు మాత్రమే పాల్గొని భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చారు. అబ్బురాజుపాలెం నుంచి ఒక్కరూ ముందుకు రాలేదు.
రాజధాని నిర్మాణానికి విరాళాలు...
బోరుపాలెం గ్రామంలో జరిగిన సభలో రాజధాని నిర్మాణం కోసం పలువురు తమ విరాళాలు ప్రకటించారు. గ్రామానికి చెందిన కట్టా నరసింహారావు రూ.11 వేలు, కట్టా శ్రీనివాసరావు రూ.10,116, నెలకుదిటి రజిని 11,111 రూపాయలను మంత్రి నారాయణ, ఎంఎల్‌ఏ శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు.