నేనున్నానని... భరోసా | Separate Corporation For Fishermen: YS Jagan | Sakshi
Sakshi News home page

నేనున్నానని... భరోసా

Published Sun, Jul 22 2018 7:18 AM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM

Separate Corporation For Fishermen: YS Jagan - Sakshi

కాకినాడలోని జేఎన్‌టీయూ సెంటర్‌ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప పాదయాత్ర నాగమల్లితోట జంక్షన్, సర్పవరం జంక్షన్, ఏపీఐఐసీ కాలనీ మీదుగా అచ్చంపేట జంక్షన్‌ వరకు కొనసాగింది. అచ్చంపేటలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై సానుకూలంగా స్పందిస్తూ భరోసా ఇచ్చారు. 

జగదీశ్వరి, కాకినాడ: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటున్నారు. రేషన్, ఆధార్‌కార్డు తెమ్మంటున్నారు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందడంలేదు. ఏడాది చదువు ఆగిపోతే డిటైన్డ్‌ అంటున్నారు. పేదలం మా పిల్లలను ఎలా చదివించుకోవాలి? పేదవాళ్లు ఇబ్బంది పడకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలిని కోరుతున్నామన్నా..

 వైఎస్‌ జగన్‌: అక్కా.. ఇంకా ఎంతో దూరం లేదు. ఆరు నెలలు ఓపికపట్టు. మొత్తం వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాం. గట్టిగా దేవుడిని మొక్కు అక్కా, రెండు కొబ్బరికాయలు కొట్టు. 

విజయ్‌ : చేపలు నిల్వ చేసుకోవడానికి సదుపాయాలు లేవు. ఫలితంగా దళారుల చేతిలో మోసపోతున్నాం. మీరు వచ్చిన తర్వాత మాకు కోల్డ్‌ స్టోరేజీలు పెట్టాలి. మోడల్‌ మార్కెట్లు స్థాపించాలి. సాగర తీరంలో గ్రామాల్లో వీటిని నిర్మించి ఇవ్వాలి. 

 వైఎస్‌ జగన్‌: చాలా మంచి సలహా ఇది. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ప్రోసెసింగ్‌ చేయాలి. లేదంటే కోల్డ్‌ స్టోరేజీలో అయినా పెట్టాలి. అప్పుడే రేటు ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. మంచి సలహా ఇచ్చావు. ఎక్కడెక్కడ ఏమేమీ పెట్టాలనే దానిపై అధ్యయనం చేద్దాం. దీనికి రమణన్న అటెండ్‌ అవుతారు. 

కుమారి, కాకినాడ: అన్నా.. ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు. బ్యాంకులకు వెళ్లి అడిగితే మీకు రుణాలు చంద్రబాబు ఇచ్చాడా? మేము ఇచ్చామా? అంటున్నారు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొండబాబు కూడా చెప్పారని అంటే కొండబాబు వచ్చి కట్టడు కదమ్మా అంటున్నారన్నా.. నెలకు రూ.30 వేలు పొదుపు చేసుకుంటామన్నా. ఇప్పుడు మా పొదుపు డబ్బులు పోయాయి. రుణాలు ఇవ్వడంలేదు. మళ్లీ ఇప్పుడు గ్రూపుకు రూ.లక్ష ఇస్తాడని మా వీధిలో పుకార్లు లేపుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు రుణాలు మాఫీ చేయనోడు, ఇప్పుడు లక్ష ఇస్తామంటే ఎలా నమ్ముదామని మా వాళ్లకు చెప్పాను. జగన్‌ మాట ఇస్తే తప్పడు. మనం జగన్‌కే ఓటు వేద్దామని చెప్పాను. నీవు సీఎం అయ్యాక ఏడు కొండలు నడిచి ఎక్కుతాను. 

వైఎస్‌ జగన్‌: చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని  మోసం చేశాడు. దీంతో వడ్డీ, చక్ర వడ్డీలుగా మారి బ్యాంకులు ఇంటికి నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వాలు రైతులు, అక్కచెళ్లమ్మల రుణాలకు కట్టే వడ్డీలు నేరుగా బ్యాంకులకు చెల్లించేవి. దాని వల్ల బ్యాంకులు వారికి వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేవి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వడ్డీ కట్టకుండా మానేశాడు. రైతులకైతే పూర్తిగా కట్టడమే మానే శాడు. ప్రతి అక్కకు, చెళ్లమ్మకు చెబుతున్నా మీరెవరూ భయపడకండీ, మీకు ఎంతైనా అప్పులుండనీవ్వండి. ఎన్నికల తేదీ వరకు మీకు ఎంతైనా అప్పు ఉండనీ, ఆ సొమ్ములు మొత్తం నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తాం. అంతేకాదు ఆ డబ్బుతో మీరేమైనా చేసుకోవచ్చు. మళ్లీ బ్యాంకులు సున్నా వడ్డికే రుణాలు ఇవ్వాలి. ఆ పరిస్థితి మళ్లీ వచ్చేందుకు, తీసుకువచ్చేందుకు ఆ ప్రతి అక్కకు, చెళ్లమ్మకు హామీ ఇస్తున్నా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వడ్డీ డబ్బులు కడుతుందని చెబుతావున్నా. 

సత్తిబాబు, కాకినాడ: అన్నా.. చంద్రబాబు పదవిలోకి రాకముందు పోర్టులో ఏ సమస్యలున్నా తీరుస్తానని ఇక్కడకు వచ్చి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. పోర్టులో పని చేసే వారికి కనీసం రూ.12 వేలు ఆదాయం వచ్చేలా చేయండన్నా.. మాకు ప్రస్తుతం రూ.మూడునాలుగు వేలే వస్తోంది. సరిపోవడం లేదన్నా.. లోకల్‌ వాళ్లకు పని కల్పించండన్నా.. మీ పక్షాన మేమంతా ఉంటాం.

 వైఎస్‌ జగన్‌: సత్తెన్నా.. ఒక్క పోర్టు మాత్రమే కాదు. ఆంధ్రరాష్ట్రంలో ఏ పరిశ్రమ ఉండనీ, ఏ యూనిట్‌ అయినా ఉండనీ. ఎక్కడన్నా ఉండనీ. దేవుడి దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన  తర్వాత మొదటి అసెంబ్లీలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం ద్వారా కట్టిన పరిశ్రమైనా సరే, కట్టబోయే పరిశ్రమైనా సరే 75 శాతం లోకల్‌ రిజర్వేషన్‌ కల్పించాలని స్పష్టం చేస్తాం. దాని వల్ల ఎవరైనా కూడా ఖచ్చితంగా 75 శాతం ఉద్యోగాలు లోకల్‌ వాళ్లకే ఇవ్వాలి. 

వాసుపల్లి కృష్ణ దుమ్మళ్లపల్లి: అన్నా.. మా గ్రామంలో 2005లో వైఎస్‌ మినీ హార్బర్‌ కట్టేందుకు శిలాఫలకం వేశారు. ఇక్కడ వంతెన ఉంది. ఇరుకుగా ఉండడం వల్ల సముద్రంలోనే బోట్లు నిలిపాల్సిన పరిస్థితి. తుపాను సమయంలో బోట్లు దెబ్బతింటున్నాయి. ఆ వంతెనను మీరు పెద్దదిగా చేస్తే మా పది మత్స్యకార గ్రామాల్లోని 40 వేల మంది మీకు అండగా ఉంటాం.  

 వైఎస్‌ జగన్‌: వాసన్నా.. నాన్న చేస్తానని చెప్పి చనిపోయారు. చంద్రబాబునాయుడు ఎలాగూ చేయలేదు. నీవు చూపిస్తున్న ఫొటోలు చూస్తే ఖచ్చితంగా బ్రిడ్జి పెద్దదిగా చేయడం అవసరమనే అనిపిస్తోంది. పూర్తిగా అధ్యయనం చేసి ఖచ్చితంగా చేద్దాం. 

ప్రసన్నకుమార్, తూరంగి: కాకినాడలో వైఎస్సార్‌ పేరుపై ఆక్వా యూనివర్సిటీ నెలకొల్పాలి.

వైఎస్‌ జగన్‌: అవును ఇది నా మనసులో కూడా ఉంది. కచ్చితంగా మెరైన్‌ యూనివర్సిటీ స్థాపించాలి. మీరు అడుగుతున్నట్లుగా మత్స్య కార ప్రాంతంలోనే ఉండాలి. కాకినాడ సరైన ప్రాంతం. ఖచ్చితంగా ఈ ప్రాంతంంలో వచ్చేటట్లుగా చేస్తానని హామీ ఇస్తున్నా.

  ప్రసాద్, ఎంపీటీసీ, ఉప్పాడ: నమస్తే అన్నా.. ఉప్పాడ గ్రామం పూర్తిగా వైఎస్సార్‌ సీపీ. ప్రస్తుత ఎమ్మెల్యే మా గ్రామాన్ని దత్తత తీసుకున్నానంటూ కక్ష సాధిస్తున్నాడు. ఫిషింగ్‌ హార్బర్‌కు గతంలో వైఎస్సార్‌ నిధులు మంజూరు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం హార్బర్‌ నిర్మించలేదు. బోటులు తిరగబడుతున్నాయి. మీరు సీఎం అయ్యాక హార్బర్‌ కట్టి మా ప్రాణాలు కాపాడతారని కోరుతున్నాం. నాన్నగారు మా గ్రామాలకు రక్షణగా జియో ట్యూబ్‌ వేశారు. మీరు మినీ హార్బర్‌ కట్టించాలి. 

వైఎస్‌ జగన్‌: చేద్దాం ప్రసాదన్నా. మారెమ్మవ్వ ఏమైనా మాట్లాడాలా? ఒకసారి మారెమ్మ అవ్వకు మైకు ఇవ్వు. 


దేవుడు, కొత్తపేట: మా పిల్లలకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలన్నా.. తిప్పకు ఎనిమిది మంది ఉంటే ఆరుగురికే  వేట నిషేధ పరిహారం ఇస్తున్నారు. అందులోనూ ఇద్దరికే వస్తోంది. పెద్ద బోట్లలో 15 మంది ఉంటున్నారు. ఎనిమిది మందికే ఇస్తున్నారు. మీరు వచ్చాక అందరికీ ఇవ్వాలి. తీర ప్రాంతంలోని ఇళ్లకు రూ.3 లక్షలు ఇవ్వాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇంటికి రెండు పేర్లకు ఇవ్వాలని కోరుతున్నా. 

వైఎస్‌ జగన్‌: దేవుడన్నా.. నీవు చెప్పినవన్నీ ఆలోచన చేద్దాం అన్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement