‘దేశం’నేతల చేరికపై అసంతృప్తి
కష్టించేవారిని కాదని వలసలకు
ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం
హైకమాండ్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి:
తాజా పరిణామాలు టీఆర్‌ఎస్‌లో అసమ్మతిని రాజేశాయి. ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో బలం పుంజుకుంటున్న పార్టీలో టీడీపీ నేతల వలసలతో గ్రూపులకు తెరలేచింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వైరివర్గంగా వ్యవహరించిన హరీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు ఇప్పుడు ఒకే గూటికి చేరడం కూడా అసంతృప్తికి ఆజ్యం పోసింది. కష్టకాలంలో పార్టీని బతికించినవారిని కాదని, కొత్త ముఖాలకు ప్రాధాన్యతనివ్వడంపై గులాబీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యమాన్ని అణచివేసిన నేతలకు ఇప్పుడు రెడ్‌కార్పెట్ స్వాగతం పలకడం, సీట్ల ఖరారుపై కూడా హామీలు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని నేతలు ఈ వ్యవహారంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై ఒకరిద్దరు నేతలు పార్టీ యువనేత కేటీఆర్‌తో మాట్లాడి తమ నిరసనగళాన్ని వినిపించినట్లు తెలిసింది.
పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల గొంతెమ్మ కోరికలు తీరుస్తూ.. పార్టీని నమ్ముకున్న దిగువశ్రేణి నాయకుల గొంతు కోయవద్దని ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు చేవెళ్ల, తాండూరు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వంపై గంపెడాశలు పెట్టుకున్న దేశమళ్ల ఆంజనేయులు, రోహిత్‌రెడ్డి కూడా తాజా పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానిక నేతలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సబబని వాపోతున్నారు. మరోవైపు జిల్లాలో టీఆర్‌ఎస్‌లో పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న హరీశ్వర్‌రెడ్డి బహిరంగంగా నోరు మెదపనప్పటికీ, తాజా పరిణామాలపై కినుక వహించినట్లు తెలిసింది. వీరి చేరికను మొదట్నుంచి హరీశ్వర్ వ్యతిరేకిస్తున్నారు.
ఈ క్రమంలో మహేందర్, రత్నం చేరికలను గోప్యంగా ఉంచి ఆఖరి నిమిషంలో మాట మాత్రంగా అభిప్రాయాన్ని కోరడంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలో వ్యతిరేక వర్గంగా వ్యవహరించి... తన ఎదుగుదలకు అడుగడుగునా అవరోధాలు కల్పించిన మహేందర్‌ను పార్టీలో చేర్చుకోవడం ఆయనను ఆందోళనకు గురిచేస్తోంది.
టీఆర్‌ఎస్ శిబిరంలో ముసలం!
Published Tue, Feb 25 2014 11:43 PM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement