పిచ్చికుక్క దాడిలో 20మందికి తీవ్ర గాయాలు
ఆరుగురిని విశాఖ తరలింపు
కుక్కల ఏరివేతకు రంగం సిద్ధం
పార్వతీపురం: పట్టణంలలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దొరికినవారిని దొరికినట్టు దాడిచేసి కరిచేసింది. దాని బారినపడి 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం అర్ధరాత్రి రాయగడ రోడ్డులోని వివేకానంద కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తొలుత దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచింది. అక్కడి జనం తేరుకునేలోగా కొత్తవీధిలో పలువురిపై దాడిచేసింది. అక్కడినుంచి మాదిగ వీధి, దేవాంగుల వీధి, గొడగల వీధి, కుమ్మరవీధుల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికి కండలు ఊడబెరికింది. తరువాత ఇందిరాకాలనీలో జనంపై దాడిచేసి, కొత్తవలస చేరుకొని ఎన్టీఆర్ కాలనీతోపాటు పలు వీధుల్లోని జనాన్ని గాయపరచింది.
ఈ దాడిలో సిరిపురం ప్రసాద్, ఎం.తరుణ్, కన్నూరి గౌరి, చీపురుబిల్లి రాముడమ్మ, బి.ఆదినారాయణ, ఎ.రమణమ్మ, కె.వెంకటి, ఎం.అప్పలనరసమ్మ, కె.రమణమ్మ, ఎస్.భద్రమ్మ, సిహెచ్.రామచంద్రమ్మ, బి.బుచ్చిరాజు, కె.రాము, పి.మరియమ్మ, డి.నారాయణరావు, ఎం.శంకర్రావు, ఆర్.అప్పలనరసమ్మ, సుందరాడ భద్రాచలం, రాజేటి రమణ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నుండే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి క్యూ కట్టారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావు, డా. పెద్దింటి రవికుమార్, డా. వెంకటరావు తదితరులు బాధితులకు వైద్య సేవలందించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.నాగభూషణరావు మాట్లాడుతూ బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదని, అందరికీ ట్రీట్‌మెంట్ ఇచ్చామనీ తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వి.సిహెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ ఇప్పటికే ఆ పిచ్చికుక్కను పట్టుకునేందుకు సిబ్బందిని నియమించామనీ, కుక్కల ఏరివేత, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లకు చర్యలు చేపట్టామనీ తెలిపారు.
భౌబోయ్!
Published Thu, Apr 28 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM
Advertisement