చలమాపై సీరియస్ | Serious on chalama | Sakshi
Sakshi News home page

చలమాపై సీరియస్

Published Mon, Jan 18 2016 1:43 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

చలమాపై సీరియస్ - Sakshi

చలమాపై సీరియస్

టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై పార్టీలోని అసమ్మతి నేతలు  ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.  ముఖ్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వ్యతిరేకించిన వారిపై  పార్టీ కార్యకర్తలు అని కూడా చూడకుండా దాడులు చేయిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.
 
గుంటూరు : మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డిపై పార్టీలోని అసమ్మతి నేతలు  ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వ్యతిరేకించిన వారిపై  పార్టీ కార్యకర్తలు అని కూడా చూడకుండా దాడులు చేయిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఆయన కుమారుడు కూడా అనేక అక్రమ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనల కారణంగా ఇన్‌చార్జిని మారుస్తారనే ప్రచారం ఎక్కువగా వినపడుతోంది.
 
ఎద్దులబోడు కబ్జాకు యత్నం..
 కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఎద్దుల బోడులోగల 532 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కొద్ది నెలలకే ఈ ఆక్రమణలకు ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు పొక్కడంతో జిల్లా కలెక్టర్, పోలీసు యంత్రాంగం జోక్యంతో ఆక్ర మణల పర్వం నిలిచిపోయిందని పేర్కొన్నారు.  
 
టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి..

 మత్స్యకారులకు ఆ శాఖ అందజేయాల్సిన సైకిళ్ళను చలమారెడ్డి భవంతిలో గతంలో భద్ర పరిచారు. ఇందులో కొన్ని సైకిళ్ళు కనిపించకపోతే ఆ శాఖలో పనిచేసే చిరు ఉద్యోగిని బాధ్యుణ్ణి చేశారు. మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నిక సందర్భంగా తన మాట నెగ్గడం లేదని చలమారెడ్డి వర్గీయు లు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి గదిలో నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. సమీప బంధువు అని చూడకుండా లక్ష్మారెడ్డిపై చలమారెడ్డి వర్గీయులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడినట్టు తెలిపారు.
 
చలమారెడ్డి కుమారుడిపై కేసులు..
మాచర్ల మండలంలో సుగాలీల తగాదాలో చలమారెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి తల దూర్చడమే కాకుండా, విజయపురిసౌత్ ఎస్‌ఐ సమక్షంలోనే సుగాలీలను కులం పేరుతో దూషించాడు. ఈ ఘటనపై శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదుకావడంతో పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయపురిసౌత్‌లోనే ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే టెండర్ల వ్యవహారంలో నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్లలో గొడవ జరిగింది. టెండర్ తన వర్గీయులకే దక్కాలని టీడీపీ వర్గీయులైన కాంట్రాక్టర్లపై శ్రీనివాసరెడ్డి దాడి చేసి టెండర్ పత్రాలను లాక్కున్నాడు. ఈ సంఘటనపై నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. స్వగ్రామంలో ఉనికిని కాపాడుకునేందుకు గ్రామ ఖాయిదా పాటల సాకుతో వెల్దుర్తి మండలం కండ్లకుంటలో చలమారెడ్డి చిచ్చు పెట్టారు. పాటల లెక్కలు చూడాలని స్థానికేతరులను వెంటబెట్టుకొని వెళ్ళి చలమారెడ్డి తగాదాకు కాలు దువ్వడం టీడీపీ, వైయస్సార్ సీపీ వర్గీయులు రాళ్ళదాడి ఘటనకు దారితీసింది.
 
ఈ సంఘటన గురించి మాట్లాడేందుకు చలమారెడ్డి టీడీపీ నేతలను వెంటబెట్టుకొని ఇటీవల మాచర్ల వచ్చిన రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌ను కలవగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. దాడులకు సహకరించడం సరికాదని ఎస్పీ చలమారెడ్డిపై అసంతృప్తిని వ్యక్తం చేయడం పత్రికల్లో ప్రచురితమైంది. పార్టీలో కొందరినే దగ్గరకు తీయడం వల్ల మరికొందరు పార్టీకి దూరమై వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. చలమారెడ్డి వల్ల పార్టీ అప్రతిష్టపాలై, పార్టీకి చాలామంది దూరమవుతున్నారని కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement