వినియోగదారులకు సేవలందించడంలో విద్యుత్తు శాఖ వెనుకబడుతోంది. ప్రతి నెలా బిల్లులు వసూలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయం చూపడంలేదు. వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా ఉద్యోగులు, సిబ్బందిని నియమించడంలో ఎస్పీడీసీఎల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌లో అనేక పోస్టులు ఖాళీగా ఉండంతో ఉన్న సిబ్బంది పనిభారంతో అల్లాడుతున్నారు. దీంతో ఏ సమస్య వచ్చినా రోజుల తరబడి పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఇక గ్రామాల్లో అయితే అంధకారం నెలకొంటోంది.
అనంతపురం టౌన్ : జిల్లాలో విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సేవలు అందించే ఉద్యోగులు లేరు. చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సి వచ్చినా.. సకాలంలో ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకునే వారు ఉండడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరిగిన మృత్యువాతపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. జిల్లాలో డీఈ, ఈఈ, ఏడీఈ వంటి ఉన్నత స్థాయి పోస్టులో రెండు ఏడీఈ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నా క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తోంది.
అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులు 16, సబ్ ఇంజనీర్ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. ఫలితంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. లైన్‌మన్, అసిస్టెంట్ లైన్‌మన్, జేఎల్‌ఎంలతో పాటు ఇతర కార్యాలయ ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బంది కలిపి మొత్తం 770 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా విభాగాల్లో 2870 పోస్టులకు గాను 2088 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇది కూడా కొన్నేళ్లు క్రితం లెక్కలే. ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. ఆ ప్రకారం ఉద్యోగులను నియమించాలంటే మరో 500 మందికి పైగానే తీసుకోవాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఉన్న వారిపై అదనపు భారం :
జిల్లాలో విద్యుత్ ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని కింద స్థాయి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం ఉండడం లేదన్నారు. ఖాళీలు అధికంగా ఉండడంతో అధికారులు తమపైనే భారం వేస్తున్నారని, దీంతో పని ఒత్తిడి పెరుగుతోందని చెబుతున్నారు.
ప్రతి నెలా నివేదిక పంపుతున్నాం
విద్యుత్ శాఖలో ఉద్యోగుల కొరత ఉంది. వినియోగదారులను అనుగుణంగా పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఖాళీల వివరాలను ప్రతి నెలా ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నాం. అవి భర్తీ అయితే మరింత మెరుగైన సేవలు అందిస్తాం.
- ఆర్‌ఎన్ ప్రసాదరెడ్డి,
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
సేవలు ఖాళీ
Published Sun, Jul 5 2015 2:21 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement