అరకొరకొర! | Seven crops fail to properly | Sakshi
Sakshi News home page

అరకొరకొర!

Published Fri, Dec 5 2014 2:30 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

అరకొరకొర! - Sakshi

అరకొరకొర!

పోయిన  యేడు పంటలు సరిగ్గా పండలేదు. అప్పు కట్టేందుకు డబ్బులు సర్దుబాటు కాలేదు. ఇంతలోపే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని ప్రకటి ంచడంతో తీసుకున్న అప్పులు పోతాయేమోనని కట్టలేదు. ఐదెకరాల పొలానికి లద్దగిరి స్టేట్‌బ్యాంక్‌లో రూ.లక్ష అప్పు తీసుకున్నా. వడ్డీతో కలుపుకొని రూ.1.30 లక్షలు అయ్యింటుంది. ఇప్పుడేమో రూ.50 వేల లోపు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇది కేవలం కంటితుడుపే. పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయాలి.     
 - వెంకటస్వామి,
 రైతు, ఎర్రదొడ్డి,
 కోడుమూరు మండలం
 
 సాక్షి, కర్నూలు : రుణమాఫీపై రోజుకో మాటతో రైతుల్లో గందరగోళం నెలకొంటోంది. మొదట్లో 20 శాతం రుణమాఫీ అన్న ప్రభుత్వం.. తాజాగా గురువారం కేవలం రూ. 50 వేలలోపు ఉన్న రుణాలను మొదట మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో జిల్లాలో ఏకంగా 3.67 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రుణమాఫీ జరగని పరిస్థితి నెలకొంది. మరోవైపు బంగారు రుణాలను మాఫీ చేయమని చెప్పడంతో కౌలు రైతులకూ కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. జిల్లాలోని 35 వేల మంది కౌలు రైతులు.. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నారు. వీరందరికీ ఇప్పుడు మాఫీ అయ్యే పరిస్థితి లేదు.
 
 రుణమాఫీపై ప్రభుత్వం నుంచి వస్తున్న రోజుకో మాటతో బ్యాంకర్లు కాస్తా రైతులను పీడించడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల బంగారాన్ని వేలం వేస్తుండగా.. మరికొన్ని చోట్ల దాచుకున్న పొదుపు సొమ్ము కాస్తా రుణాల చెల్లింపు కింద జమ చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. అంతేకాకుండా 2013 సంవత్సరానికి సంబంధించిన పంటల బీమా సొమ్ము వస్తే దాన్ని కూడా రుణాల్లో జమ చేసుకునేందుకు బ్యాంకర్లు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద రుణమాఫీపై రోజుకో గందరగోళం ప్రజల్లో నెలకొంటోంది.

 1.57 లక్షల ఖాతాలకే లబ్ధి
 జిల్లాలో 6.50 లక్షల మంది రైతులున్నారు వీరికి చెందిన 5.24 లక్షల ఖాతాలకు సంబంధించి పంట, బంగారు రుణాలు కలిపి మొత్తం రూ. 3,600 వేల కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో పంట రుణాలే రూ. 2,200 కోట్లు. ఇక  టర్మ్‌లోన్స్, బంగారు రుణాలన్నీ కలిపి మరో రూ. 1,400 కోట్ల వరకు ఉన్నాయి.
 
 ఇందులో కేవలం బంగారు రుణాలు మాత్రమే రూ. 600 కోట్లు. వాస్తవానికి ప్రభుత్వం కుటుంబానికి రూ. లక్షన్నర వరకు మాఫీ అని పేర్కొనడంతో జిల్లాలో రూ. 2,160 కోట్ల వరకు మాఫీ అవుతాయని భావిస్తున్నారు. ఇందుకోసం సేకరించిన వివరాలన్నీ క్రోడీకరించుకున్న తర్వాత ఇటీవల 2.50 లక్షల అకౌంట్లకు సంబంధించిన వివరాలను మరోసారి తనిఖీ చేసి పంపాలని కోరుతూ రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) నుంచి బ్యాంకర్లకు పంపారు.
 
  పరిశీలన అనంతరం ఈ ఖాతాల వివరాలను మంగళవారం సాయంత్రానికే తిరిగి ఎస్‌ఎల్‌బీసీకి పంపారు. ఇందులో రూ. 50 వేలలోపు ఉన్న రుణాలు కేవలం 30 శాతానికి మించవని ప్రాథమిక అంచనాకు బ్యాంకులు వచ్చాయి. అంటే జిల్లాలో వెంటనే రుణమాఫీ ద్వారా లబ్ధి పొందేది కేవలం 1.57 లక్షల ఖాతాలు మాత్రమేనన్నమాట. అంటే మరో 3.67 లక్షల ఖాతాలకు రుణమాఫీ ఎప్పుడు అవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
 
 అయితే, లక్షా 57 వేల ఖాతాల కింద ఎన్ని రుణాలున్నాయనే విషయాన్ని బ్యాంకర్లు ఎవరూ నిర్దారించడం లేదు. ఎన్నికల ముందు నుంచే రుణాల చెల్లింపులు నిలిపివేసిన రైతులు గడిచిన సంవత్సర కాలానికి 14 శాతం వడ్డీతోపాటు ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని కోల్పోయారు. పైగా రుణాలు చెల్లించనిదే కొత్త రుణాలు ఇచ్చేదీ లేదని బ్యాంకర్లు బల్లగుద్ది చెబుతుండడం.. వడ్డీ భారం రోజురోజుకీ పెరిగిపోతుండడంతో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ విధంగా 14 శాతం వడ్డీ లెక్కన జిల్లాలోని రైతులపై రూ. 300 కోట్ల అదనపు భారం పడిందనేది బ్యాంకర్ల అంచనాలే చెబుతున్నాయి.
 
 కౌలు రైతుకు కొత్త కష్టాలు
 బంగారు రుణాలను మాఫీ చేయమంటున్న సీఎం ప్రకటనతో కౌలు రైతులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. జిల్లాలో రుణ అర్హత కార్డులు తీసుకున్న కౌలు రైతులు 35 వేల మంది ఉన్నారు. వాస్తవానికి జిల్లాలో లక్షా 50 వేల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో రుణ అర్హత కార్డులు తీసుకున్న 35 వేల మంది బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తీసుకున్నారు. వీరందరికీ ఇప్పుడు రుణ మాఫీ అయ్యే పరిస్థితి లేదు. మరోవైపు బంగారాన్ని వేలం వేసేందుకు బ్యాంకులు ఇప్పటికే సిద్ధపడ్డాయి. అనేక చోట్ల నోటీసులు కూడా ఇచ్చి వేలానికి సిద్ధపడితే.. రైతులు అడ్డుకున్న సంఘటనలు జరిగాయి.  ఈ పరిణామాలతో రుణమాఫీకై ఎదురుచూస్తున్న కౌలు రైతుల ఆశలు కాస్తా ఆడియాశలయ్యాయి. దాదాపు రూ. 200 కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. ఈ రుణంపై 14 శాతం చొప్పున రూ. 28 కోట్ల వడ్డీ భారం పడింది. అయితే సకాలంలో వర్షాలు రాకపోవడం.. పంటల దిగుబడి అనుకున్న స్థాయిలో రాకపోవడంతో వీరు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితులు లేవు.
 
 డ్వాక్రా సంఘాల పొదుపు హుష్‌కాకి...!
 జిల్లా వ్యాప్తంగా 35 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా.. రూ. 535 కోట్లు రుణాలు ఉన్నాయి. సర్కారు ఒక్కో సంఘానికి కేవలం రూ. లక్ష మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. చంద్రబాబు మాటలు నమ్మి వారు రుణాలు చెల్లించకపోవడం బ్యాంకర్లు ముక్కుపిండి వాటిని వసూలు చేస్తున్నారు. 11.75 శాతం చొప్పున ఈ సంఘాలపై సుమారు రూ. 62 కోట్లు వడ్డీ భారం పడింది.
 
 అంతేకాకుండా జిల్లాలో కోడుమూరు తదితర ప్రాంతాల్లో బ్యాంకులు ఏకంగా.. ఇన్ని రోజులుగా డ్వాక్రా సంఘాలు చేసుకున్న పొదుపు మొత్తాలను కాస్తా రుణాల చెల్లింపు కింద జమ చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు చంద్రబాబు మాకు ఏదో చేస్తారని ఆశిస్తూ వచ్చిన రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు, నిరుద్యోగులు ఇక సర్కారును నమ్ముకుంటే ఒరిగేదేమీ లేదని ఆందోళన బాటకు సిద్ధమవుతున్నాయి. బాబు మాయమాటలు నమ్మి మోసపోయామంటూ లబోదిబోమంటున్న అన్నదాతలు శుక్రవారం రోడ్డెక్కెందుకు సన్నద్ధమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement