సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విలీన ‘పంచాయితీ’ మొదటికొచ్చింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో శివారు పంచాయతీల విలీనంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రజాప్రతినిధులు, రాజకీయపక్షాల విమర్శల నేపథ్యంలో మెట్టుదిగిన సర్కారు గ్రేటర్‌లో పంచాయతీలను కలపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వీటిని కొత్త మున్సిపాలిటీలుగా మార్చేందుకు మొగ్గుచూపుతోంది. నగరీకరణ నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలంటే నగరపాలక సంస్థతోనే సాధ్యమని భావించిన ప్రభుత్వం.. 35 శివారు పంచాయతీలను గ్రేటర్ పరిధిలో చేరుస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే, జీహెచ్‌ఎంసీలో పంచాయతీలను కలిపేస్తే జిల్లా ఉనికికే భంగం కలుగుతుందని, మహానగర పరిధిని పెంచుకునేందుకు తాపత్రయపడుతున్న సర్కారు ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వడంలేదని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విలీనాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళనకు అధికారపక్షం మద్దతుగా నిలవడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ కూడా ప్రతికూలంగా స్పందించడం, కేబినెట్ భేటీలో ఏకంగా మంత్రులు శ్రీధర్‌బాబు, ప్రసాద్‌కుమార్‌లు ఈ అంశంపై తీవ్ర అభ్యంత రం వ్యక్తంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. మరోవైపు ఉన్నత న్యాయస్థానం కూడా పంచాయతీల విలీన తీరును తప్పుపట్టింది. చట్టపరంగా విలీన ప్రక్రియ జరగలేదని గుర్తించిన న్యాయస్థానం.. గ్రేటర్ పరిధిలోకి పంచాయతీలను చేరుస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓను కొట్టివేసింది. ఈ క్రమంలోనే పంచాయతీల విలీనంపై పునఃసమీక్షించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మంగళవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, చేనేత శాఖ మంత్రులు మహీధర్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, ఇరుశాఖల ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టర్ బీ.శ్రీధర్ పాల్గొన్నారు.
గ్రేటర్ వద్దు.. మున్సిపాలిటే ముద్దు
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా శివార్లను గ్రేటర్‌లో కలపడమే ఉత్తమమని పురపాలకశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి పట్టుపట్టారు. నిధులలేమి వల్ల పంచాయతీలు శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండదని, జీహెచ్‌ఎంసీలో నిధులు పుష్కలంగా ఉన్నందున విరివిగా పనులు చేపట్టవచ్చని చెప్పారు. వార్డులకు ప్రత్యేక ఫండ్ ఉన్నందున .. నిర్ధేశిత ప్రాంతంలోనే నిధులు వెచ్చించే వీలుంటుందని, ఇవేగాకుండా ఎమ్మెల్యే కోటాలోని నిధులూ వాడుకోవచ్చని అన్నారు. ఈ వాదనతో విభేదించిన మంత్రి ప్రసాద్‌కుమార్.. తమ జిల్లా అస్థిత్వానికి ప్రమాదకరంగా మారిన ఈ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. స్వర్గీయ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి పేరిట ఏర్పడిన జిల్లా ఉనికిని దెబ్బతీసేలా శివారు ప్రాంతాలను గ్రేటర్‌లో కలపడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సమావేశం దృష్టికి తెచ్చారు. దశలవారీగా శివార్లను కలుపుకుంటూ పోతే జిల్లా స్వరూపం కోల్పోవడం ఖాయమని చెప్పారు. ప్రసాద్ వాదనతో ఏకీభవించిన మహీధర్‌రెడ్డి నగరరూపు సంతరించుకున్న విలీన గ్రామాలను గ్రేటర్‌లోకాకుండా.. మున్సిపాలిటీలుగా కొత్తగా ఏర్పాటుచేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపం, జనాభా ప్రాతిపదికన కొత్తగా ఆరు లేదా ఏడు పురపాలక సంఘాలు ఏర్పడే అవకాశాలున్నాయని, వీటిని క్షుణ్ణంగా అధ్యయనంచేసి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.
పంచాయతీలకు ఫైళ్లు!
పంచాయతీల విలీనానికి హైకోర్టు బ్రేక్‌వేసిన నేపథ్యంలో రికార్డులను ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. విలీనమా లేదా మున్సిపాలిటీలా అనే అంశం తేలేవరకు ఆయా పంచాయతీల పరిధిలో పరిపాలన సజావుగా సాగేందుకు వీలుగా రికార్డులు వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. న్యాయస్థానం తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి మున్సిపాలిటీలు ఏర్పాటుచేసే అంశంపై ప్రతిపాదనలు తయారుచేయాలని మంత్రి జానారెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు తీర్పునకు లోబడి ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉన్నందున.. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నగరానికి చేరువలో ఉన్న కొన్ని పంచాయతీలను మాత్రం జీహెచ్‌ఎంసీలో కలిపేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఈ ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది.
పంచాయతీల ‘విలీనం’పై వెనక్కి తగ్గిన సర్కారు
Published Wed, Oct 2 2013 1:05 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement