సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో తీవ్రతుఫాను కేంద్రీకృతం
పై-లీన్ ఇప్పటికీ పెను తుఫానుగానే ఉంది. గడిచిన ఆరు గంటలుగా ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ప్రస్తుతం ఒడిశాలోని సంబల్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మరింత ఉత్తరదిశగా పయనించి, ఈరోజు మధ్యాహ్నానికి తుఫానుగాను, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగాను మారుతుందని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించిన వాతావరణ సూచనలో తెలిపింది.
దీని ప్రభావం రాష్ట్రం మీద ఉత్తర కోస్తాలో తీవ్రంగా ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. గాలుల వేగం తగ్గింది. ఉత్తరాంధ్ర, ఒడిశాలలో ప్రస్తుతం గాలుల వేగం గంటకు 110-120 కిలోమీటర్లుగా ఉంది. ఇది ఈరోజు మధ్యాహ్నానికి గంటకు 80-90 కిలోమీటర్లకు తగ్గుతుంది.
విశాఖలో సముద్రం ఇంకా రఫ్ గానే ఉన్నా, నిన్నటితో పోలిస్తే బాగా తగ్గింది. మధ్యాహ్నానికి ఇంకా శాంతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల పాటు ఈ ప్రభావం ఇంకా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గాలుల వేగం, వర్షాలు అన్నీ తగ్గుతాయి.