బాలికపై లైంగిక దాడి..
విజయనగరం క్రైం: కంటికి రెప్పలా కాపాడాల్సిన పెంపుడు తండ్రే ఆ పాప పాలిట రాక్షసుడయ్యాడు. వావి వరసలు మరచి బాలికపై లైంగిక దాడికి పాల్పడి, చిత్రహింసలకు గురి చేశాడు. నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏడాదిగా ఇలాగే వేధిస్తున్నట్లు సమాచారం. కన్నతండ్రి లేకపోవడంతో పెంపుడు తండ్రి సంరక్షణలో ఉన్న ఆ బాలిక ఆ రాక్షసుని వికృత చేష్టలను, దాడి గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన అనుభవించింది.
చివరకు ఆ బాధను భరించలేక ఆ బాలికే సోమవారం రాత్రి నేరుగా రెండో పట్టణపోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి, చైల్డ్‌లైన్ ప్రతినిధులకు సమాచారమందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధులు బాలికను, ఆమె తల్లిని విచారణ చేశారు. తనకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితుల్లో తాను ఉండిపోవలసి వచ్చిందని బాలిక తల్లి చైల్డ్‌లైన్ ప్రతినిధుల వద్ద తెలిపింది. చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరంలోని కమ్మవీధిలో ఓ మహిళ నివాసం ఉంటోంది. భాస్కరరావు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
వీరికి బాలిక జన్మించింది. అయితే బాలికకు ఐదేళ్ల వయసున్నప్పుడు భాస్కరరావు వదిలి వెళ్లిపోయాడు. ఈ సమమంలో ఆమెకు ఆటో డ్రైవర్ పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరూ ఒకదగ్గరే ఉంటున్నారు. ప్రస్తుతం బాలిక పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆటో డ్రైవర్ బాలికను తన ఆటోలో పాఠశాలకు తరలిస్తుంటాడు. స్నానం చేసి తర్వాత బట్టలు మార్చుకున్న సమయం, తల్లి పడుకున్న తర్వాత బాలిక వద్దకు వచ్చి శరీరంపై చేయి వేయడం వంటి అసభ్యకర పనులతో పాటు, లైంగిక దాడి చేసేవాడు.
అలా ఏడాదిగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అయితే భరించలేకపోయిన ఆ బాలిక సోమవారం రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు ఆటో డ్రైవర్ శివప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌కు వచ్చి పరిశీలించారు. ఆ బాలికను విజయనగరం పట్టణంలోని చైల్డ్‌లైన్ కార్యాలయానికి తరలించారు.