సిగ్గు.. సిగ్గు | shame shame | Sakshi
Sakshi News home page

సిగ్గు.. సిగ్గు

Published Mon, Jul 7 2014 2:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

సిగ్గు.. సిగ్గు - Sakshi

సిగ్గు.. సిగ్గు

సాక్షి, అనంతపురం : ‘ఏం చెప్పమంటారు సారూ మా పరిస్థితి! ఎన్ని సార్లు అడిగినా అధికారులు స్పందించడం లేదు. మా పల్లెలో ఇద్దరికో..ముగ్గురికో తప్ప ఇంకెవరికీ మరుగుదొడ్లు లేవు. బహిర్భూమికి ఆరు బయటకు వెళ్లడానికి సిగ్గుతో చస్తున్నాం’’ ఇదీ మాజీ రాష్ట్రపతి, దివంగత నీలం సంజీవరెడ్డి స్వగ్రామమైన గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన ఓబుళమ్మ ఆవేదన. ఈమెకు చిన్నపాటి ఇల్లు ఉన్నా వ్యక్తిగత మరుగుదొడ్డి మాత్రం లేదు. ప్రభుత్వం నిర్మిస్తోందని తెలుసుకున్న ఈమె పలుమార్లు అధికారులను కలిసి పరిస్థితి వివరించింది. అయినా ఇంతవరకు మంజూరు కాలేదు. ఒక్క ఇల్లూరులోనే కాదు... జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా... ఆచరణలో మాత్రం విఫలమవుతున్నాయి.  
 
 జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 25 లక్షల జనాభా ఉంది. కుటుంబాల పరంగా చూసుకుంటే 5,56,543 ఉన్నాయి. ఇందులో 5,19,943 కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. ఇందులోనూ 5,01,058 కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో ఈ సంఖ్యను తగ్గించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సిబ్బందితో గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయించి మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించాయి. నిర్మల్ భారత్ అభియాన్ కింద తొలివిడతగా జిల్లాలోని 372 పంచాయతీలలో 98,284 మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
 
 ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా రూ.4,600, ఉపాధిహామీ  కింద రూ.5,400 చొప్పున.. మొత్తం రూ.10 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుడి  ఖాతాలో ఆన్‌లైన్ ద్వారా జమ చేస్తారు. అయితే.. 2013 మార్చి నుంచి ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో నిర్మించిన మరుగుదొడ్ల సంఖ్య  3,945 మాత్రమే. అంటే.. తొలివిడత లక్ష్యంలో ఐదు శాతం కూడా పూర్తి కాలేదు. పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి  20 నుంచి 25 శాతం మంది బయటకు వెళ్లక తప్పడం లేదు. పట్టణాలలోని మురికివాడలు, పల్లెల్లో  క్షయ, మలేరియా, పైలేరియా, టైఫాయిడ్, కాలేయ సంబంధ వ్యాధులు ప్రబలటానికి బహిరంగ మలవిసర్జనే కారణమని వైద్యులు అంటున్నారు.
 
 పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి
 అన్ని పాఠశాలల్లోనూ మరుగుదొడ్లు నిర్మించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే.. కొన్ని పాఠశాలల్లో మాత్రమే నిర్మించారు. వాటిలోనూ నిర్వహణ గాలికొదిలేశారు. ఇక నిర్మాణం చేపట్టని వాటిలో విద్యార్థుల అవస్థలను ఎవరూ పట్టించుకోవడం లేదు. 40 శాతం పాఠశాలల్లో విద్యార్థినులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
 ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయించడంలో ప్రజాప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  వీటిపై కనీసం నియోజకవర్గ స్థాయిలో ఏ శాసనసభ్యుడు కూడా సమీక్ష జరపలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో అప్పట్లో  ఇలాంటి లోపాలన్నీ వెలుగులోకి రాలేదు. ప్రస్తుతమైనా శాసనసభ్యులు ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement