
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. సోమవారం శాసన మండలిలో బీసీ సబ్ ప్లాన్, ఆదరణ పథకంలో జరిగిన అవినీతిపై శంకర్ నారాయణ మాట్లాడారు. గడిచిన అయిదేళ్లలో ఆదరణ పథకంపై పత్రికల్లో పలు అవినీతి కథనాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆదరణ పథకం పనిముట్ల నాణ్యతపై పలు చోట్ల ఆరోపణలు వ్యక్తమయ్యాయని మంత్రి తెలిపారు. అయితే వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని శంకర్ నారాయణ చెప్పారు.
అవినీతి బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 2015 నుంచి 2019 వరకు బీసీ సబ్‌ప్లాన్ కింద రూ. 36,472 కోట్లు కేటాయింపులు మాత్రమే జరిగాయన్నారు. అయితే వాటిల్లో ఖర్చు చేసింది రూ.28,804.75 కోట్లు మాత్రమే అని మంత్రి తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి తమ ప్రభుత్వం రూ.15,061 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు.