
రఘువీరా.. నోటిని అదుపులో పెట్టుకో !
► కనీసం డిపాజిట్టు కూడా సాధించలేని నువ్వా.. జగన్ గురించి మాట్లాడేది?
► శంకరనారాయణ ఫైర్
అనంతపురం : పదేళ్లు మంత్రిగా పని చేశావు. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్టు కూడా దక్కించుకోలేక పోయావు.. అలాంటి నువ్వా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి విమర్శలు చేసేది.. నోటిని అదుపులో పెట్టుకో..’ అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ శివాలెత్తారు. సోమవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జనాదరణ కలిగి, ప్రజల కోసం పోరాడుతున్న ఏకైక వ్యకి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్, అందుకు సహకరించిన టీడీపీ రెండూ తమ అధ్యక్షుడి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
పెనుకొండ ప్రజలు డిపాజిట్టు కూడా ఇవ్వని స్థితిలో ఉన్న మీరు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నువ్వు ప్రాతినిధ్యం వహించిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అభ్యర్థి లేకుండా చేశావు.. అలాంటి నీవు రాజకీయంగా నీవు ఎంత దిగజారిపోయావో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ వారితో అనైతిక పొత్తులు పెట్టుకుని కాంగ్రెస్‌లోని ఓ వర్గాన్ని దెబ్బ తీయడాన్ని మరువలేద న్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలంటే జగన్‌మోహన్‌రెడ్డి లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు అవసరమని చింతా మోహన్ అన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అలాంటివన్నీ కప్పి పుచ్చుకుని, రాహుల్‌గాంధీ వద్ద మెప్పు పొందేందుకు నేడు తమ పార్టీపైన, జగన్‌మోహన్‌రెడ్డి పైనా అవాకులుచవాలకులు పేలుతున్నావని, నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. ఆ రోజు వైఎస్ పుణ్యమా అని రాష్ట్రంలో, కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆయన మరణానంతరం తుంగలో తొక్కిన కారణంగానే సోనియాగాంధీకి ఎదురొడ్డి రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీని స్థాపించారన్నారు.