వైఎస్‌ఆర్ కుటుంబంపై వెల్లువెత్తిన అభిమానం | Sharmila concludes padayatra at Ichapuram | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ కుటుంబంపై వెల్లువెత్తిన అభిమానం

Published Mon, Aug 5 2013 5:52 AM | Last Updated on Fri, May 25 2018 8:09 PM

Sharmila concludes padayatra at Ichapuram

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వైఎస్‌ఆర్ కుటుంబంపై రాష్ట్ర ప్రజలు అభిమాన వర్షం కురిపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుఠిల, కుతంత్రాలను ఎండగడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రజలకు బాసటగా రాష్ట్రంలో సాగించిన మరోప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన జ్ఞాపిక వద్ద ఏర్పాటు చేసిన సభ జన సందోహంతో నిండిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జనం ఇచ్ఛాపురానికి తలిరావడం ప్రారంభించారు. పాదయాత్రలో ఉన్న షర్మిల నేరుగా సాయత్రం నాలుగు గంటలకు విజయప్రస్థాన స్థూపం వద్దకు చేరుకున్నారు.
 
 తండ్రి వైఎస్ ఆవిష్కరించిన ప్రజాప్రస్థాన స్థూపం వద్ద రాజన్నకు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ విగ్రహంతో ఏర్పాటు చేసిన విజయప్రస్థాన స్థూపాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి నేరుగా వేదిక మీదకు వచ్చారు. అప్పటికే వేదిక జనంతో నిండిపోయింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యారు. షర్మిలతో పాటు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర చేసిన వారు ఆమె వెన్నంటే ఉన్నారు. నేతల ప్రసంగాలు పూర్తయిన తరువాత కూడా జనం అలాగే నిల్చుండిపోయారు. ముందుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మాట్లాడిన తరువాత షర్మిల మాట్లాడారు. వైఎస్‌ఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, చేపట్టిన పథకాలు, విజయవంతమైన తీరును ఒక్కొక్కటిగా షర్మిల వివరించారు. ప్రజలపై ఎటువంటి భారం పడకుండా ఐదేళ్ల కాలం వైఎస్ ప్రజల కోసం ఏమిచేశారో కళ్లకు కట్టినట్లు వివరించారు.
 
 ఆయన మరణించారనే వార్త వినగానే ప్రతి కుటుంబం తన ఇంటి పెద్దను కోల్పోయామనే బాధతో ఎంతో మంది మరణించారని షర్మిల పేర్కొన్నారు. ప్రజలకు ఏమి అవసరమో, ఎలా చేస్తే ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉంటారో ఆలోచించి పథకాలు ప్రవేశపెట్టారని, ఆ పథకాల ద్వారా ప్రతి కుటుంబం సుఖంగా జీవించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ రెక్కల కష్టంమీద వచ్చిందనే విషయాన్ని ఈపాలకులు గుర్తించకుండా ఆయన చనిపోయిన తరువాత అతని పేరును ఎఫ్‌ఆర్‌లో చేర్చి దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, ఏ తప్పూ చేయని జగనన్నను కూడా అకారణంగా జైలులో పెట్టి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఇన్ని నెలలు జైలులో ఉంచినందుకు సీబీఐని దోషిగా గుర్తించాలని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్రలను ఛేదించేందుకు ప్రజలే న్యాయనిర్ణేతలు కావాలని పిలుపు నిచ్చారు. ప్రజా కోర్టులోకి వచ్చి ఢీకొనే సత్తా కాంగ్రెస్‌కు కాని, దానికి కొమ్ముకాస్తున్న టీడీపీకి కాని లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతానికి నష్టం చేకూరే విధంగా వ్యవహరించిందని, అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందిన తరువాత విడగొడితే బాగుండేద నే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతలు గాజులు తొడుక్కొని కూర్చున్నారా? అంటూ అనడంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించివేదిక వద్ద నుంచి జనం జేజేలు పలుకుతూ జిందాబాద్‌లు కొట్టారు. విభజన జరిగిన తరువాత హైదరాబాద్‌లో బతకడం అంటే పాకిస్థాన్‌లో బతకడమే అవుతుందన్నారు. ఓ తండ్రి అన్నదమ్ములకు భాగ పంపకాలు చేయాలంటే అందరినీ సమాన దృష్టితో చూస్తాడని, ఈ పాలకులు అలా కాకుండా వ్యత్యాసాలు చూపారన్నారు.
 
  పలు అంశాలపై సమగ్రమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడని, నిజం చెబితే ఆయన తల ముక్కలవుతుందని శాపం ఉందని షర్మిల చెప్పారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేసిన ప్రసంగం జనాన్ని ఉద్వేగానికి గురిచేసింది. తన భర్త జనం గురించి నిత్యం ఆలోచించారు.  ఆయన మరణానంతరం జగన్ మీ వద్దకు వచ్చారు. ఆయనను మీ నుంచి కాంగ్రెస్ వారు దూరం చేశారు. నా బిడ్డలను మీ చేతుల్లో పెట్టాను, వారిని ఆదరించి అక్కున చేర్చుకోమని చెప్పాను. షర్మిలను మీచేతుల్లో పెట్టాను. మరోప్రజా ప్రస్థానంలో నా బిడ్డ జీవితంలో ఎన్నో మలుపులు సంభవించాయి. వైఎస్ అపురూపంగా షర్మిలను పెంచుకున్నాడు. షర్మిలకు గాయమైనప్పుడు పడిన బాధను చూసినప్పుడు నాకు చాలా చాలా కష్టమనిపించింది. నా మనస్సు అప్పుడు చాలా బాధపడింది అంటూ ఉద్వేగానికి గురయ్యారు. అమ్మా ఎంత మంచి బిడ్డలను కన్నావమ్మా ఎంతైనా పులిబిడ్డ పులిబిడ్డలేనమ్మ అంటూ జనం అంటుంటే నాకు కళ్ళ నిండా నీళ్లు వచ్చినా సంతోషంగా ఉండేది.
 
 అందుకే షర్మిల జగన్ సంధించిన బాణంగా రాష్ర్టంలో పాదయాత్ర చేసిందన్నారు.షర్మిల వేదక వద్దకు మరో ఐదు నిమిషాల్లో వస్తుందనగా పావుతక్కువ నాలుగు గంటల సమయంలో పూల వర్షం కురిసింది.జనం కేరింతలు కొట్టారు. ఇచ్ఛాపురంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని విజయమ్మ వివరించారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు వంశీకృష్ణ యాదవ్, కొయ్యప్రసాదరెడ్డి, చెంగల వెంకటరావు, ఉషాకిరణ్, బలిరెడ్డి సత్యారావు, గండి బాబ్జీ,   బి.సూర్యారావు, జహీర్ అహ్మద్, తిప్పలనాగిరెడ్డి, ఎస్.రవిరాజు, కోలా గురువులు, పూడి మంగపతిరావు,  వంజంగి కాంతమ్మ, కిలారి సర్వేశ్వరరావు, బొడ్డేడ ప్రసాద్,  కోరాడ రాజబాబు, పెట్ల ఉమాశంకర్, కొత్తపల్లి గీత, భూపతిరాజు శ్రీనివాసరాజు, సత్తిరామకృష్ణారెడ్డి, కాకర్లపూడి శ్రీకాంతరాజు, బి.పూలరెడ్డి, దాడి రత్నాకర్, గొలగాని శ్రీనివాసరావు, ఏఆర్‌కె రాజు, గల్ల అప్పారావు, ఎన్.శివారెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, చిక్కాల రామారావు, ప్రభాగౌడ్, రవిరెడ్డి, కంపా హనుక్, ఎం.మనోజ్‌బాబు, గంపల గిరిధర్‌విజయనగరం జిల్లా నేతలు పెనుమత్స సాంబశివరాజు, అవనాపు విజ య్, గురాన అయ్యలు,  కడుబండి శ్రీనివాసరావు, పెనుమత్స సురేష్‌బాబు, గొర్లె వెంకటరమణ, గేదెల తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్, బోకం శ్రీనివాస్,వేచలపు చినరామునాయుడు, డాక్టర్ పెద్ది నాయుడు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, కాకర్ల పూడి శ్రీనివాసరాజు, మక్కువ శ్రీధర్, జమ్మాన ప్రసన్నకుమార్, శ్రీవాణి, రాయల సుందరరావు, ప్రశాంత్, తూర్పుగోదావరి జిల్లా నేతలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏబి బుచ్చిమహేశ్వరరావు, కర్రి పాపారాయుడు, మందపాటి కిరణ్‌కుమార్,బొడ్డు వెంకట అనంత చౌదరి, టికె విశ్వేశ్వరరెడ్డి, చెలమశెట్టి సునీల్, రావూరి వెంకటేశ్వరరావు,   పశ్చిమగోదావరి జిల్లా నేతలు ఆళ్ల నాని, తానేటి వనిత, మద్దాల రాజేష్, శ్రీరంగనాధరాజు, ముదునూరు ప్రసాదరాజు, చెలుమూరు అశోక్ గౌడ్, తలారి వెంకటరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement