సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ‘సమైక్య శంఖారావం’ పేరిట బస్సుయాత్ర చేపట్టిన షర్మిల గురువారం డోన్, కర్నూలులో నిర్వహించిన బహిరంగసభల్లో ప్రసంగించారు. వేలాదిగా తరలివచ్చిన సమైక్యవాదులు, ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. నిప్పు కణికల్లా ఆమె నోటి నుంచి వెలువడ్డ మాటలకు సభలకు హాజరైన జనం చప్పట్లు, ఈలలతో సంఘీభావం ప్రకటించారు. వజ్రంలాంటి రాష్ట్రాన్ని రంపంతో కాంగ్రెస్ పార్టీ కోస్తుందని, అందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సంపూర్ణ సాయం అందించారని ఆమె చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రలో అగ్గి రాజుకొని తగలబడిపోతుంటే... అందులో కాంగ్రెస్ చలి కాచుకుంటుందంటూ షర్మిల ప్రస్తుతం 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చారు. డోన్‌లో, కర్నూలు నగరంలో ఆమె ప్రసంగం వినేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా ఉంటామని చెప్పిన ఆమె.. జగనన్నతోనే మళ్లీ రాజన్న రాజ్యం సాకారమవుతుందని భరోసా ఇచ్చారు.
జనం పక్కనే జగన్ నిలిచారని ఉద్ఘాటించారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన షర్మిల అంతకు ముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో పోల్చి చూపారు. చంద్రబాబు హయంలో ప్రజలు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులను, రాజన్న హయంలో పొందిన సంక్షేమాన్ని లెక్కలతో సహా వివరించారు. ఆ వెంటనే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఈ నాలుగేళ్లలో రాష్ట్రం ఎంత వెనక్కు వెళ్లిందో తెలియజేశారు. పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ గృహాలు, 108, 104, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సామాన్యుడి జీవితాలతో కిరణ్ సర్కార్ చెలగాటమాడుతున్న తీరుపై ధ్వజమెత్తారు. అదే సమయంలో వైఎస్ హయంలో ఒక్క రూపాయి కూడా పెంచకుండా ప్రజలకు సేవలందిస్తే , ఆయన తదనంతరం కాంగ్రెస్ సర్కార్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను ఎలా పెంచిందో వివరించి ప్రజలను ఆలోచింపజేశారు. ఇవన్నీ పోగా... ఇప్పుడు కొత్తగా సమైక్య రాష్ట్రాన్ని విభజించే నిర్ణయం తీసుకొని సీమాంధ్ర ప్రజలను ఎడారిపాలు చేసే పన్నాగం పన్నిన తీరును ఎండగట్టారు.
చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖతోనే, ఆయనతో కాంగ్రెస్ పార్టీ నేతలు చేసుకున్న కుమ్మక్కు రాజకీయాల వల్లనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని పునరుద్ఘాటించడం సమైక్యవాదుల ఉద్యమానికి కొత్త ఊపిరినిచ్చినట్టయింది. ‘కొత్త రాష్ట్రం ఏర్పాటైతే ఇప్పటికే కర్ణాటకతో తుంగభద్ర నీటికోసం పోరాడుతున్న రాయలసీమవాసులు రేపు తెలంగాణతో కూడా పోరాడాలా? శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు నీళ్లెలా వస్తాయి? పోలవరానికి నీళ్లు రాకుండా ఎగువన మరో డ్యాం నిర్మిస్తే కోస్తాంధ్ర పరిస్థితి ఏంటి?...’ అంటూ కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిలను సభకు హాజరైన జనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలపడం వారి హర్షద్వానాలతోనే తేటతెల్లమైంది.
చంద్రబాబుకు ప్రశ్నల వర్షం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయండి అంటూ బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు తెలుగు ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సులో బయలుదేరడాన్ని షర్మిల ఎద్దేవా చేశారు. వెన్నుపోటు దారుడిగా చరిత్రకెక్కిన చంద్రబాబుకు అసలు ఆత్మ అనేది ఉందా? 9 ఏళ్లలో హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెబుతున్న చంద్రబాబు చార్మినార్‌ను, నాగార్జునసాగర్‌ను నేనే కట్టానని, చివరికి విశాఖపట్నానికి సముద్రాన్ని కూడా నేనే తెచ్చానని చెప్పుకుంటాడని అంటూ ఆయన నైజాన్ని ఘాటుగా దుయ్యబట్టారు. ‘కేంద్రానికి లేఖ ఇచ్చి ఇప్పుడు వైఎస్ వల్లనే విభజన జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌తో వైఎస్‌ఆర్‌సీపీ కుమ్మక్కైందని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ 16 నెలలుగా జైల్లో ఉండేవాడా? చిరంజీవిలా ఏ కేంద్రమంత్రి గానో, ముఖ్యమంత్రో అయిపోయేవాడు కాదా? చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకొని, కేసుల్లేకుండా చేసుకున్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలియదా? జగన్ జైల్లో ఉండడానికి మీ కుమ్మక్కు రాజకీయాలు కారణం కాదా?’ అంటూ చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించి సభకు హాజరైన సమైక్యవాదులకు తనదైన శైలిలో వాస్తవాలు వెల్లడించారు.
కర్నూలు, డోన్ సభల్లో కడప మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, కాటసాని రామిరెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గురునాథ రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, గౌరు చరితా రెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బుగ్గన రాజారెడ్డి, కోట్ల హరిచక్రపాణి రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ, గుమ్మనూరు జయరాం, ఇతర నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఐజయ్య, శివానందరెడ్డి, తెర్నెకల్లు సురేందర్ రెడ్డి, హఫీజ్ ఖాన్, నారాయణమ్మ, బాలరాజు, గద్వాల నియోజకవర్గ సమన్వయకర్త కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని 60 ఏళ్ల క్రితం రాజధానిగా ఉన్న కర్నూలును వదులుకొని హైదరాబాద్‌ను రాజధాని చేశాం. ఇప్పుడు వెళ్లిపోవాలంట. పదేళ్లలో హైదరాబాద్ వంటి రాజధానిని కట్టుకోవాలంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధి అయ్యేందుకు 60 ఏళ్లు పడితే.. పదేళ్లలో అలాంటి రాజధానిని ఎలా కట్టుకోవాలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కోట్లాది మందికి అన్యాయం జరుగుతుంటే తెలంగాణకు అనుకూలమని బ్లాంక్ చెక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు?’
- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల
షర్మిల వాణి.. సమైక్య బాణి
Published Fri, Sep 6 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement