సాక్షి ప్రతినిధి, కర్నూలు:
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న వివిధ వర్గాలను ఉత్తేజపరుస్తూ... రాష్ట్ర సమైక్యత కన్నా పదవులే ముఖ్యమని వాటిని పట్టుకు వేళాడుతున్న నాయకులకు చురకలు అంటిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల నంద్యాలలో చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం తలనెరిసిన రాజకీయవేత్తలనూ ఆలోచింపజేసింది. సమైక్యాంధ్ర కోసం షర్మిల చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం కర్నూలు నుంచి నంద్యాల, కోయిలకుంట్ల మీదుగా వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చేరుకుంది. జిల్లా ప్రజలు షర్మిలకు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నంద్యాలలో వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ, కోస్తాంధ్రలు ఎడారిగా మారతాయని చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ఆందోళనతో రోడ్లపైకి వస్తున్నా... పదవులు పట్టుకు వేళాడుతున్న కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులపై ఆమె నిప్పులు చెరిగారు. రాజకీయాలు, పార్టీలు ముఖ్యం కాదని, భావితరాల గురించి ఆలోచించి ఇప్పటికైనా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వచ్చి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆమె హితవు పలకడంతో సమైక్యవాదుల నుంచి హర్షాతిరేఖాలు వెల్లువెత్తాయి.
అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి ఆ అగ్గిలో చలికాచుకుంటున్న కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర విభజనకు అనుకూలమైన లేఖ ఇచ్చిన చంద్రబాబును ఆమె తన ప్రసంగంలో తూర్పారబట్టిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. రాష్ట్రాన్ని నిలువునా కోసేందుకు కత్తి ఇచ్చి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న చంద్రబాబు అంతటి దుర్మార్గుడు ఎవరూ ఉండరంటూ జనం చప్పట్ల మధ్య పునరుద్ఘాటించారు. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆయన చేసిన కృషి కారణంగా రాయలసీమ ప్రజలు రెండు పంటలు వేసుకుంటున్నారని, అదే విడిపోతే ఒక్కపంటకూ నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందనే వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నీటి కోసం కర్ణాటక, మహారాష్ట్రలతో తగాదాలు పెట్టుకుంటున్న మనం రేపు మరో కొత్త రాష్ట్రంతో కొట్లాడాలా అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఎదురయ్యే సాగునీటి సమస్యను వివరించారు.
శ్రీశైలం నుంచి సీమకు వస్తున్న ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవాలకు నీరిచ్చే పరిస్థితి ఉంటుందా అంటూ జనాల్లో చైతన్యం నింపారు. వైఎస్ ఉన్నప్పుడు పోలవరం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని చూశారని, ఇప్పుడు రాష్ట్రం విడిపోతే తెలంగాణలో మరో ప్రాజెక్టు కడితే పోలవరానికి నీరెక ్కడి నుంచి తెస్తారని ఆమె కాంగ్రెస్ నేతలను సూటిగా ప్రశ్నించి సమస్య తీవ్రతను తెలియజేశారు. రాష్ట్ర విభజనకు కారకులెవ్వరు.. విడిపోతే వచ్చే సమస్యలు... విడిపోకుండా ఉండేందుకు చేయాల్సిన కృషిని ఆమె తన ప్రసంగంలో అందరినీ ఆకట్టుకునేలా వివరించి ప్రశంసలు పొందారు.
కట్టలు తెంచుకున్న జనవాహినినంద్యాలలో మిట్ట మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సభకు నంద్యాలతో పాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గతంలో ఏ సభలో, ఎన్నడూ చూడనంత జనం షర్మిల సభకు తరలివచ్చినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. నంద్యాలకు వచ్చే అన్ని రోడ్లు జనంతో కిటకిటలాడగా, సభ ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు సెంటర్ ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. మాజీ ఎంపీ, పార్టీ నంద్యాల ఇన్‌చార్జి భూమా నాగిరెడ్డి సభకు వచ్చిన జనానికి అభినందనలు తెలియజేస్తూ సమైక్య ఉద్యమంలో అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
దారి పొడవునా నీరాజనాలు
కర్నూలులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బసచేసిన షర్మిల ఉదయాన్నే తనను కలిసేందకు వచ్చిన నాయకులు, ప్రజలు, చిన్నారులతో మాట్లాడి సమైక్యాంధ్ర కోసం సాగిస్తున్న ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం సెయింట్ జోసెఫ్ కళాశాల, పాఠశాల విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన భూమా నాగిరెడ్డి కర్నూలులో విద్యార్థులు, విద్యాసంస్థలు చేస్తున్న ఉద్యమ తీరును ఆమెకు వివరించారు.
అనంతరం నంద్యాలకు బయలుదేరిన షర్మిలకు బి.తాండ్రపాడు, నన్నూరు, ఓర్వకల్లు, కాల్వబుగ్గ, సుగాలిమెట్ట, తమ్మరాజు పల్లె, పాణ్యం, నంద్యాల వరకు అడుగడుగునా ప్రజలు ఎన్‌హెచ్ 18 పైకి వచ్చి స్వాగతం పలికారు. తనకు జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో ఆహ్వానం పలుకుతున్న వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా హుస్సేనాపురంలో గ్రామస్తులు షర్మిలకు అరటిగెలను బహుమతిగా అందజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నంద్యాల సభ అనంతరం వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు బయలుదేరగా, జిల్లా సరిహద్దుల వరకు ప్రజలు నీరాజనాలు పట్టారు. గోస్పాడులో ట్రాక్టర్లు అడ్డుపెట్టి మరీ షర్మిలను తమ వద్దకు వచ్చి మాట్లాడాల్సిందిగా అభ్యర్థించగా, సమయం మించిపోతుందని చెప్పి ముందుకు సాగారు.
కోయిలకుంట్ల బైపాస్ వద్ద వేలాదిగా ప్రజలు రాగా, వారికీ అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. నొస్సం వరకు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు వెళ్లి వీడ్కోలు పలికారు. బస్సుయాత్రలో పార్టీ సీనియర్ నేతలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, యాలూరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బస్సుయాత్రకు ఎన్‌హెచ్ 18 పొడవునా ఘన స్వాగతం
Published Sat, Sep 7 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM
Advertisement