
సాక్షి, హైదరాబాద్ : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలు, పింక్ డైమండ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినుతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రమణకుమార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, తన హయంలో ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు.
రమణకుమార్ మీడియా ప్రకటనను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పకుండా రిటైర్డ్ అధికారులతో ఎందుకు మట్లాడిస్తున్నారని నిలదీశారు. ఎవరో చెప్పిన మాటలు విని నివేదికలు తయారు చేసే అధికారులు టీటీడీలో ఉన్నారా ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకి వస్తాయని శశిధర్ అన్నారు.