రోజాపై దాడిలో ఎర్రచందనం స్మగ్లర్ కీలక పాత్ర
- నియోజకవర్గనేత తనయునికి సన్నిహితుడు
- బియ్యం, ఇసుక, లిక్కర్ మాఫియాలో టీడీపీ ముఠా: రోజా
పుత్తూరు: నగరి పట్టణంలో వారం కిందట జరిగిన గంగ జాతర ఉత్సవాల్లో నగరి ఎమ్మెల్యే రోజాపై చోటుచేసుకున్న దాడి సంఘటనలో నగరికి చెందిన టీడీపీ నాయకుడు, ఎర్రచందనం స్మగ్లర్ పాత్ర ఉందనే విషయం తెలిసింది. దాడికి ప్రోత్సహించడంతో పాటు రోజాపై వ్యతిరేకంగా ధర్నాలకు సహకరించిన శ్రీనివాసులు ఎర్రచందనం తరలిస్తూ శుక్రవారం వడమాలపేట పోలీసులకు పట్టుపడ్డారు. ఇతనితోపాటు స్నేహితుడు చంద్రబాబు, నగరిపట్టణం సత్రవాడకు చెందిన రమేష్‌కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీలో మండల యువత అధ్యక్షుడి హోదాలో కొంతకాలం, ప్రస్తుతం మండలస్థాయి నాయకుడి హోదాలో పట్టణంలోని బేరి వీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు ప్రతిరోజూ లక్షల్లో ఫైనాన్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు టీడీపీ నియోజకవర్గనేత, మాజీ ప్రజాప్రతినిధి తనయుడితో సన్నిహితంగా ఉంటున్నారనేది ఆ పార్టీ వర్గాల వాదన. దీనిని పరిశీలిస్తే ఆపార్టీ నేతకు నగరిలో ఇసుక, బియ్యం స్మగ్లింగ్‌తోపాటు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది. దొంగలు దొంగ లు కలసి ఊర్లు పంచుకున్నట్లుగా అధికారపార్టీకి చెందిన నాయకులు ఇలా బరితెగిస్తున్నరంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా నగరి గంగజాతరలో రోజాపై జరిగిన దాడిలో టీడీపీకి చెందిన ఆరుగురిని ప్రోత్సహించి కీలకపాత్ర వహించడంలో శ్రీనివాసులుపై ఎర్రచందనం దొంగలించినట్లుగా కేసు నమోదు కావడం సందేహాలకు తావిస్తోంది.
పట్టుపడ్డ వారు అధికారపార్టీకి చెందిన వారు కావడంతో వారిని బహిరంగంగా చూపించడలో ముఖానికి ముసుగు వేసి పోలీసులు జాగ్రత్త వహించారనే వాదనలు లేకపోలేదు. ఇటీవల ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన తమిళ తంబీలు, ఇతర ప్రాంతాలకు చెందిన వారి ముఖాలు కనిపించే విధంగా పోలీసు, అటవీ శాఖ అధికారులు వాహనాలతో సహా ఫోటోలు దిగారు. అయితే ఇందుకు భిన్నంగా వడమాలపేటలో పోలీసు అధికారులు వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
ముందుగా పోలీసుల దృష్టికి తెచ్చా
నగరిలో బియ్యం, లిక్కర్, ఇసుక మాఫీయాతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో టీడీపీ నాయకులు ఉన్నారనే విషయాన్ని ముందుగానే పోలీసుల దృష్టికి తెచ్చాను. కాగా ఈనెల 12 వ తేదీన నగరిలో నిర్వహించిన జాతర సందర్భంగా అమ్మవార్లు ఊరేగింపులో నాపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డాడు.
-ఆర్‌కే. రోజా, నగరి ఎమ్మెల్యే