ఉద్దేశపూర్వకంగానే నాపై కాల్పులు: చక్రపాణిరెడ్డి
సాక్షి, నంద్యాల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై కాల్పులు జరిపారని వైఎస్‌ఆర్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. కాల్పుల ఘటనపై శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ... ‘కాల్పులు జరిపింది అభిరుచి మధునే. మధు చేతిలో గన్‌తో మాపైకి దూసుకు వచ్చాడు. చుట్టు ఉన్నవారు నిలువరించడానికి ప్రయత్నించినా మధు ఆగలేదు. అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే అటకాయించారు. మా వాహనాలను ముందుకు వెనక్కి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదేంటని మా వాళ్లు ప్రశ్నిస్తే.. మీ సంగతి చూస్తామన్నారు. మీ సంగతి తేల్చడానికే ఇక్కడికి వచ్చామని బెదిరించారు. వాళ్ల చేతుల్లో గన్‌లు ఉన్నాయి.
కార్లలో వేట కొడవళ్లు ఉన్నాయి. దాడి విషయాన్ని పోలీసులకు చెబితే తాత్సారం చేశారు. కొత్త సూరజ్ హోటల్ వద్ద దాడి జరిగిందని పోలీసులకు చెబితే పాత సూరజ్‌కు వెళ్లామని చెప్పారు. పోలీసులు నిదానంగా వచ్చి అందరిని పంపే ప్రయత్నం చేశారు. నిన్న మా కార్యకర్తలను కొట్టారు. నేడు నాపై దాడికి ప్రయత్నించారు. అభిరుచి మధుపై రౌడీ షీట్ ఉంది. ఆయనకు నేర చరిత్ర కూడా ఉంది. కార్లలో వేట కొడవళ్లు, కత్తులు ఎందుకు?. మేం గత నెల రోజులుగా సంయమనం పాటిస్తూనే ఉన్నాం. టీడీపీ నేతలు మాత్రం ప్రతిసారి రౌడీయిజాన్ని చూపిస్తున్నారు. ఈ చర్యలకు మేము, మా కార్యకర్తలు భయపడేది లేదు. మేం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం. ఇటువంటి చర్యలను ప్రభుత్వం కూడా ఖండించాలి.’ అని అన్నారు.
సంబంధిత వార్త...: నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు!
కాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ఆయుధాలను పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలి. అయితే నిబంధనల ప్రకారం గన్‌తో పాటు బుల్లెట్‌లను కూడా అప్పగించాలి. కౌంటింగ్ పూర్తయ్యేవరకూ ఆయుధాలు పోలీస్ స్టేషన్‌లోనే ఉండాలి. అయితే నిబంధనలు అతిక్రమించిన టీడీపీ నేతలు తమ వద్దే ఆయుధాలు ఉంచుకున్నారు.