ప్రజాతీర్పును గౌరవిస్తాను: శిల్పా మోహన్‌రెడ్డి
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బు పంచడం, భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించడానికి కారణం కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి వల్లే టీడీపీకి ఓట్లు పడ్డాయన్న వాదనను తాను విశ్వసించడం లేదని చెప్పారు.
అనారోగ్యం, మలేరియా ఫీవర్ వల్ల 28 రోజులు తాను ప్రజల్లోకి వెళ్లలేకపోయానని, అయితే, ఆ ప్రభావం పడలేదని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి 18వేల ఓట్లకుపైగా ఆధిక్యం టీడీపీకి వచ్చిన నేపథ్యంలో ఇంత ఆధిక్యం తగ్గించడం సాధ్యపడకపోవచ్చునని, ఏదిఏమైనా ప్రజాతీర్పును గౌరవిస్తానని ఆయన చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ నేతలు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేశారని తెలిపారు. ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషించకుంటామని ఆయన చెప్పారు.