- ఏజెంట్ ఫారాలు ఇవ్వనీయకుండా కుట్రలు
- పోలింగ్ ఏజెంట్లు, సిబ్బందిని బయటికి పంపిన అధికారులు
- ఖాకీల తీరుపై మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
- టీడీపీ మంత్రులు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు
నంద్యాల: మరికొద్ది గంటల్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభంకానుండగా, నంద్యాల వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటివద్ద పోలీసులు హల్‌చల్ చేశారు. మంగళవారం రాత్రి నంద్యాలలోని శిల్పా ఇంటికి వచ్చిన పోలీసులు.. అక్కడున్న సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటికి పంపేశారు. దీంతో ఆగ్రహించిన శిల్పా మోహన్‌రెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏజెంట్లకు ఫారాలు పంచనీయకుండా అడ్డుపడటం సరికాదని హితవుపలికారు. కానీ పోలీసులు ఎంతకీ వినిపించుకోలేదు.
రేపటి పోలింగ్ కోసం ఆయా పోలింగ్ స్టేషన్లలో కూర్చునే ఏజెంట్లుకు సంబంధిత పత్రాలు ఇస్తుండగా, పోలీసులు బిలబిలమంటూ దూసుకొచ్చి అక్కడున్నవారిని బయటికి తీసుకెళ్లారు. పత్రాలు తీసుకోకపోతే రేపు ఉదయం పోలింగ్ స్టేషన్‌లో కూర్చునే వీలుండదని, కొద్ది నిమిషాల్లోనే పత్రాలు తీసుకొని వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన శిల్పా మోహన్‌రెడ్డి...‘మీరు అధికార పక్షానికి కొమ్ము కాయడం సరికాదు’అని పోలీసులతో అన్నారు. అటుపై మీడియాతో మాట్లాడారు.
కుట్రలకు భయపడం: ‘‘ఎస్సైలు, సీఐలు, డీఎస్సీలు ఇంటికొచ్చి మా పోలింగ్ ఏజెంట్లు, వాచ్‌మెన్, డ్రైవర్లును పంపేశారు. సోదరుడు చక్రపాణిరెడ్డిని కూడా వెళ్లిపోమన్నారు. మా ఇంట్లో మమ్మల్ని ఉండొద్దనడమేంటి? మేం ఉండేదే నంద్యాలలో. ఇంకా ఎక్కడికి పోవాలి? ట్రాఫిక్ అంటున్నారు, మా ఇల్లు మెయిన్ రోడ్డుమీద లేదే, అయినా టీడీపీ మంత్రులు బసచేసిన సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద పదుల సంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో జనం ఉన్నారు. ట్రాఫిక్ సమస్య అక్కడ లేదా? టీడీపీ నాయకుడు వర్ల రామయ్య నంద్యాల సినిమా హాలులో కనిపించాడు. మంత్రి ఆదినారాయణరెడ్డి నంబర్‌ప్లేట్ లేని వాహనంలో తిరుగుతున్నాడు. సోమిరెడ్డి తదితరులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ల గురించి పట్టించుకోని పోలీసులు.. ఏకపక్షంగా మా ఇళ్లపైకి రావడమేంటి? కుట్రలతో మమ్మల్ని భయపెట్టాలనుకుంటే మేము భయపడే సమస్యేలేదు’’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు.
మా ‘డ్యూటీ’ మేం చేస్తున్నాం: ‘ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డికి ఏజెంట్లతో మాట్లాడే హక్కు ఉటుందికదా? మీకె ఎందుకు అడ్డుకుంటున్నారు?’అని ‘సాక్షి’ ప్రతినిధి పోలీసులను ప్రశ్నించగా.. ‘మా డ్యూటీ మేం చేస్తున్నాం’ అనే సమాధానం వచ్చింది. నంద్యాలలో 144 సెక్షన్ ఉందని, ఇంట్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండొద్దని పోలీసులు చెప్పారు. అయితే శిల్పా ఇంటి నుంచి బయటికొచ్చిన వారిలో కొందరు మాత్రం ‘పోలీసులు టీడీపీ డ్యూటీ’ చేస్తున్నారంటూ మండిపడ్డారు.