ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా? | shivarama krishnan critisized chandrababu naidu | Sakshi
Sakshi News home page

ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?

Published Tue, Apr 21 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?

ధాన్యాగారాన్ని ధ్వంసం చేస్తారా?

రాజధాని’లో చంద్రబాబు కూరుకుపోయారు
నిపుణుల కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ విమర్శ

    వీజీటీఎం ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం.. దేశంలోనే ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి
    సారవంతమైన పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ స్పష్టంచేసింది
    రెండు, మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను రాజధాని కోసం తీసుకోవటం దురదృష్టకరం
    కొత్త రాజధాని నగరంలో ఐదేళ్లలోనే నగరాన్ని, సదుపాయాలను నిర్మిస్తామనటం అతిశయోక్తి
    రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ మొత్తం సమతుల అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి పెట్టాల్సి ఉంది
    ఇప్పటికైనా బాబు పునరాలోచించుకోవాలి:
‘ద హిందూ’లో రాజధానిపై నిపుణుల కమిటీ చైర్మన్ వ్యాసం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారంగా పరిగణించే ప్రాంతంలో వేల ఎకరాల భూములను రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి తీసేసుకోవడం.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హ్రస్వదృష్టికి నిదర్శనమని.. ఏపీ రాజధానిపై నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన కె.సి.శివరామకృష్ణన్ తప్పుపట్టారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక విస్తృత సవాళ్లపై దృష్టిసారించాల్సి ఉండగా.. చంద్రబాబు కేవలం రాజధాని నిర్మాణం అంశంలోనే కూరుకుపోతున్నారని ఆయన విమర్శించారు. సాధ్యమైనంత వరకూ సారవంతమైన, పంట భూముల జోలికి వెళ్లరాదని రాజధానిపై నిపుణుల కమిటీ తన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. చంద్రబాబు దానిని విస్మరించి ఏడాదికి రెండు, మూడు పంటలు పండే వేలాది ఎకరాలను రాజధాని కోసం సేకరించబూనటం దురదృష్టకరమని అభివర్ణించారు. శివరామకృష్ణన్ జాతీయ ఆంగ్ల దినపత్రిక ‘ద హిందు’లో సోమవారం రాసిన ఒక వ్యాసంలో ఈ విమర్శలు చేశారు. వ్యాసంలోని ముఖ్యాంశాలివీ...

  •  విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి (వీజీటీఎం) ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ధాన్యాగారం. మొత్తం భారతదేశంలోనే అతి ముఖ్యమైన ధాన్యాగారాల్లో ఒకటి. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ఏటా రెండు పంటలు, మూడు పంటలు పండే 30,000 ఎకరాలకు పైగా పంట భూములను రాజధాని కోసం తీసేసుకోవటం.. హ్రస్వ దృష్టికి నిదర్శనం. ఈ చర్య ఫలితంగా తాత్కాలిక ఆర్థిక లబ్ధి కోసం రైతులు భూనిర్వాసితులవుతారు.
  •  భూగర్భ నీటిమట్టం అధికంగా గల ప్రాంతంలో నేలను గట్టిపరచటం, రహదారులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయటానికి, నిర్మించటానికి చాలా సమయం పడుతుంది. స్వాతంత్య్రం తర్వాత దేశంలో నిర్మించిన గాంధీనగర్, చండీగడ్, భువనేశ్వర్, ఉక్కునగరాలైన బొకారో దుర్గాపూర్, రూర్కెలా తదితర దాదాపు 100 కొత్త పట్టణాలకు.. కనీస మౌలిక సదుపాయాల నిర్మాణానికే ఏడెనిమిదేళ్లు పట్టింది. ఏపీలో ఇవన్నీ ఐదేళ్ల కాల వ్యవధిలో చేయవచ్చన్నది పూర్తి అతిశయోక్తి.
  •  ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్‌పై పనిచేస్తున్న సింగపూర్ కంపెనీలు.. రాజధాని ప్రాంతానికి వెలుపల, వీజీటీఎం ప్రాంతం లోపల 3,000 ఎకరాల భూమి కావాలని అడుగుతున్నట్లు చెప్తున్నారు. అదే జరిగితే సింగపూర్ కోటాలోకి వెళ్లే భూమి వ్యవసాయ భూమి.
  •  రాష్ట్ర రాజధాని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడులను అంతర్జాతీయంగా సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఈ విషయంలో ఏపీకి తాము అందించగల సాయంపై పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది.
  •  చిత్తూరు, తిరుపతిల్లో ప్రధానంగా ప్రయివేటు రంగ సంస్థల సాయంతో కొన్ని వైద్య, విద్యా సంస్థల ఏర్పాటు మొదలవుతుండటం ఆహ్వానించదగ్గ విషయం. అయితే.. రాయలసీమ సామర్థ్యానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరం.
  •  ఆర్థిక రాజధాని కూడా వీజీటీఎం ప్రాంతానికి బదిలీ అవుతుందన్న విషయం తెలుస్తోంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తుతాయనేది ఖచ్చితం. ఏపీ సీఎంగా సమతుల్యమైన అభివృద్ధిపై దృష్టిసారించాల్సి ఉందని, కేవలం వీజీటీఎం ప్రాంతం అభివృద్ధి గురించి మాత్రమే కాదని నిపుణుల కమిటీ పదేపదే చెప్పింది.
  •  ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పంచుకోవటానికి పదేళ్ల సమయం ఇచ్చింది. చంద్రబాబు పునరాలోచించుకోవటానికి ఇంకా సమయముంది.

'రాజధాని ప్రాజెక్టు వల్ల నేరుగా ప్రభావితమయ్యే వారే కాకుండా.. ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సొంత వ్యవసాయ భూమి లేని, ఆదాయం లేని లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల భద్రతకు, సంక్షేమానికి భరోసా ఇవ్వటం ఆచరణాత్మకంగా అసాధ్యం'

'ఏపీ ఎదుటనున్న అతి తీవ్రమైన సవాలు.. ఏటా మూడు లక్షల ఉద్యోగాలను సృష్టించటమని నిపుణుల కమిటీ పదే పదే స్పష్టంగా చెప్పింది. కానీ ఈ ఉద్యోగాలేవీ కనిపించటం లేదు. ఇటీవలి తుపానులతో దెబ్బతిన్న పట్టణాలను పునర్మించాల్సి ఉంది. హైకోర్టు వంటి ముఖ్యమైన సంస్థలను రాష్ట్రంలో నిపుణుల కమిటీ సూచించిన విధంగా ఏర్పాటు చేయాల్సి ఉంది.'
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement