సవరణలు ఎందుకివ్వలేదు?
కిరణ్, చంద్రబాబులపై శోభానాగిరెడ్డి ధ్వజం
అసెంబ్లీ వేదికగా కుమ్మక్కయ్యారని విమర్శ
బిల్లును వ్యతిరేకిస్తూ తాము సవరణలిచ్చామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మరోసారి కుమ్మక్కై ఆరుకోట్ల మంది సీమాంధ్ర ప్రజలను, సమైక్యవాదులను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉపనేత భూమా శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ వారిద్దరూ సవరణలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆమె శనివారంనాడిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బిల్లును వ్యతిరేకిస్తూ, 1 నుంచి 108 దాకా ఉన్న క్లాజ్‌లను తిరస్కరిస్తూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజయమ్మ నేతృత్వంలో తమ పార్టీ ఎమ్మెల్యేలంతా సవరణలు ప్రతిపాదించినట్టు తెలిపారు. కిరణ్, చంద్రబాబులిద్దరూ బీఏసీ సమావేశానికి రాకుండా ఇరుప్రాంత నేతలను పంపించి డ్రా మాలు చే స్తున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లుపై చర్చలోనూ ఆ రెండు పార్టీలూ కుమ్మక్కై దివంగత రాజశేఖరరెడ్డి, సభలో లేని జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లుతున్నారని విమర్శించారు. బిల్లు అసెంబ్లీకి ఏవిధంగా వస్తుందో చూస్తానంటూ ప్రగల్భాలు పలికిన కిరణ్ ఇప్పుడు ప్రజలను మోసగిస్తున్నారని తెలిపారు. సమైక్యతీర్మానం చేస్తే పార్లమెంటు, సుప్రీంకోర్టులో ఒక ఆయుధంలా పనిచేస్తుందని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మాదిరిగానే సభా నిబంధనలైన 77, 78ల కింద సమైక్య తీర్మానం చేయాలని సంతకం చేసిన మంత్రి శైలజానాథ్ శాసనసభా వ్యవహారాలశాఖకు మారేసరికి స్వరం మార్చారని దుయ్యబట్టారు.
సీఎం ఉద్దేశమేమిటో చెప్పాలి: బిల్లుపై ఓటింగ్ ఉంటుందని సభా నాయకుడైన సీఎం హామీ ఇస్తే, చర్చకు అంగీకరిస్తామని విజయమ్మ డిమాండ్ చేస్తే దానికి స్పష్టమైన సమాధానమేలేదని శోభానాగిరెడ్డి చెప్పారు. తనకు సొంత ఆలోచనలున్నాయని చెప్పడానికి ఇదేమీ కిరణ్ సొంతింటి వ్యవహారంకాదన్నారు. ఆయన ఉద్దేశమేంటో తక్షణం సభకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బిల్లును వెనక్కి తిప్పి పంపాలని ఈనెల 8 వ తేదీదాకా డిమాండ్ చేసిన టీడీపీలో రాత్రికి రాత్రి ఏం మార్పొచ్చి చర్చకు అంగీకరించారని ప్రశ్నించారు. బీఏసీ సమావేశానికి డుమ్మా కొడుతున్న చంద్రబాబు అసెంబ్లీలో బొమ్మలా కూర్చుంటూ విభజనకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇవ్వని కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు ఎందుకు నిలదీయడంలేదని ప్రశ్నించారు. ఒక్క వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే రాష్ట్రపతికి అఫిడవిట్లు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఉద్యోగసంఘాల నాయకులు చొక్కా పట్టుకొని నిలదీసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు. బిల్లును తిరస్కరిస్తూ వారిద్దరూ సవరణలు ఎందుకివ్వలేదో నిలదీయాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోలు ఇచ్చిన బంద్‌కు మద్దతిస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా... సమైక్యం కోసం పోరాటం చేసే ఎవరికైనా మద్దతిస్తామని ఆమె తెలిపారు.