వికేంద్రీకరణ జరగాలి | Should be decentralized | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణ జరగాలి

Published Tue, Sep 23 2014 12:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

వికేంద్రీకరణ జరగాలి - Sakshi

వికేంద్రీకరణ జరగాలి

రాష్ట్రంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్నీ జిల్లాగాఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సూచించారు. అమలాపురంకేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పడాలన్నారు. అమలాపురంలో సోమవారం జరిగిన ‘మోదీ వందరోజుల పాలన సభ’లో ఆయనప్రసంగించారు. అంతకుమందు పుల్లేటికుర్రులో పార్టీ జెండా స్థూపాన్ని, 100 రోజుల అభివృద్ధి పోస్టర్‌ను ఆవిష్కరించారు.
 
అమలాపురం రూరల్ : రాష్ట్రంలో అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ జరగాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా విభజించాలని హరిబాబు సూచించారు.
 
అమలాపురం కేంద్రంగా కోనసీమను ప్రత్యేక జిల్లా చేయాలన్నారు. కత్తిపూడి నుంచి కృష్ణాజిల్లా పామర్రు వరకు గల జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరింపజేసేందుకు కృషి చేస్తానన్నారు. కాకినాడ- పాండిచ్చేరి బకింగ్‌హాం కాలువను అభివృద్ధి చేసి జలరవాణా పెంచాలన్నదే తన లక్ష్యమన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని  బలమైన శక్తిగా పటిష్టం చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వందరోజుల పాలనను ప్రపంచ దేశాలే కీర్తిస్తున్నాయన్నారు. పార్టీని కార్యకర్తలు బలోపేతం చేయాలన్నారు. శాసన సభాపక్ష నాయకుడు పి.విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ  2019 నాటికి అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
 
కేంద్ర మాజీ మంత్రి యూవీ కృష్ణంరాజు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలు వ్యవసాయంతోపాటు చేపలు, రొయ్యల ఉత్పత్తి ద్వారా వేలాది కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయని, ఈ రెండు జిల్లాల్లో జల, రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ ఆదాయం మరింత పెరుగుతుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి నివేదించానన్నారు. మరో కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు టీడీపీ నాయకులు స్థానిక బీజేపీ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడంలో బీజేపీ నాయకులు కీలకంగా వ్యవహరించి పార్టీని ప్రజలకు చేరువచేయాలన్నారు. 100రోజులలో ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలను నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు వివరించారు.
 
జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు మాట్లాడుతూ నరేంద్రమోదీ సాంకేతిక రంగంలో కూడా దేశాన్ని అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో ఉన్నారన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందని, మళ్లీ అదే తరహాలో మోదీ నాయకత్వంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ, పైడా కృష్ణమోహన్, సురేష్‌రెడ్డి, మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు మాలతీ రాణి, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్‌వీ నాయుడు, ముదునూరి రంగరాజు, బసవా చినబాబు, నల్లా పవన్, యల్లమిల్లి కొండ, పాలూరి సత్యానందం, బసవా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
 
బీజేపీలో చేరిన ఆల్డా చైర్మన్ దొరబాబు
రాష్ట్ర ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సమక్షంలో ఆపార్టీలో చేరారు. మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ గంగరాజు, పార్టీ నాయకులు సోము వీర్రాజు తదితరులు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతోపాటు నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల డీఎల్‌డీఏ చైర్మన్‌లు సురేష్‌రెడ్డి, దాసరి గంగాధరరావు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ కుడుపూడి సూర్యనారాయణతోపాటు అల్లవరం మాజీ ఎంపీపీ మల్లాడి యామినీ పద్మప్రియ, మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షుడు మల్లాడి హనుమంతరావుతోపాటు పలువురు బీజేపీలో చేరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement