పుష్కరాల భక్తులకు అన్ని సేవలూ అందించాలి
భద్రత విషయంలో రాజీ వద్దు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు
ఘాట్‌లలో నిర్మాణ పనుల పరిశీలన
ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో సమీక్ష
రాజమండ్రి :‘గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు అందించే సేవల్లో ఎటువంటి ఇబ్బందీ రాకూడదు. వారికి స్నేహభావంతో సేవలందించాలి. వారికి ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా భక్తుల స్నేహపూర్వక పుష్కరాలు నిర్వహించాలి. అలాగే భద్రత విషయంలో రాజీ పడవద్దు’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాజమండ్రి పర్యటనకు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉభయ గోదావరి జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాగునీరు, పారిశుధ్యం విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. ‘ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నందున తాగునీరు మనమే అందించాలి.
పుష్కర ఘాట్లవద్దనే కాకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనం రద్దీగా ఉండే ఇతర ప్రాంతాల్లో కూడా మంచినీటి కుళాయిలు అందుబాటులో ఉంచాలి’ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 15 నాటికి ఇంజనీరింగ్‌కు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, కార్పొరేషన్, పంచాయతీరాజ్, దేవాదాయ తదితర శాఖల ద్వారా ఇప్పటివరకూ రూ.502 కోట్లతో 1,194 పనులు చేపట్టగా, సుమారు రూ.449 కోట్ల విలువైన 1,103 పనులు 92 శాతం పూర్తయ్యాయన్నారు. అలాగే రూ.697 కోట్లతో చేపట్టిన 1,363 పనులు చేపట్టగా, రూ.452 కోట్ల విలువైన 814 పనులు జరుగుతున్నాయని వివరించారు.
పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. దీనిపై కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, కాకినాడ జేఎన్‌టీయూతో క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఒప్పందం చేసుకున్నారని, పనుల్లో నాణ్యతను వారు పరిశీలిస్తారని చెప్పారు. కృష్ణారావు మాట్లాడుతూ, రైల్వేస్టేషన్, బస్టాండ్ల నుంచి వచ్చే భక్తులు ఘాట్‌లకు చేరుకునేందుకు సౌకర్యాలు కల్పించాలని, అలాగే భారీగా వచ్చే వాహనాలకు పార్కింగ్ స్థలాల గుర్తింపు సైతం పూర్తి చేయాలని సూచించారు. ఆటోల రాకపోకలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ మా ట్లాడుతూ, కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలు పెంచాలన్నారు. పుష్కరాల సమయంలో ఎమర్జన్సీ కోటా పెంచాల్సిందిగా రైల్వే శాఖను కోరాలని సూచించారు.
కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఇంజనీరిం గ్ పనుల్లో మిగిలిన నిధులను ఇతర పనులకు వినియోగించేలా అనుమతి ఇవ్వాలని కోరగా, ప్రభుత్వానికి నివేదిస్తానని కృష్ణారావు చెప్పారు. పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనులను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ జె.మురళి తొలుత వివరించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, ప్రత్యేకాధికారి కె.ధనుంజయరెడ్డి, కలెక్టర్ అరుణ్‌కుమార్ కలిసి పుష్కర ఘాట్లను పరిశీలించారు.
కోటిలింగాల ఘాట్ నిర్మాణ తీరుతెన్నులు పరిశీలించిన కృష్ణారావు పిండప్రదానానికి ప్రత్యేక ప్రాంతాలను ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ మురళీమోహన్, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మేయర్ పంతం రజనీ శేషసాయి, జేసీ ఎస్.సత్యనారాయణ, రాజమండ్రి సబ్ కలెక్టర్ వి.విజయరామరాజు, ఇరిగేషన్ సీఈ ఎస్.హరిబాబు, ఎస్‌ఈ ఎస్.సుగుణాకరరావు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు కేఎస్ జవహర్‌రెడ్డి, బి.శ్యాంబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర, మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ వాణీమోహన్, ఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజు, ఏలూరు రేంజ్ డీఐజీ హరికుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ పాల్గొన్నారు.
ఎలాంటి ఇబ్బందీ రాకూడదు
Published Wed, May 27 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM
Advertisement
Advertisement