సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు దద్దమ్మల్లా ఉండకుండా పార్టీలకు, పదవులకు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి గురువారం కర్నూలులో డిమాండ్ చేశారు. లేకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరం దేశానికి రెండో రాజధాని అవుతుందని ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుట్రపూరితంగా వ్యవహారించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించారని ఆయన ఆరోపించారు.
తెలుగుగంగా, కేసీ కెనాల్, ఎస్పార్బీసీలకు నీరు ఎలా ఇస్తారో చెప్పకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కర్నూలులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో భూమా నాగిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.