మా నాన్నను వేధిస్తున్నారు
టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గతంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డిని టీడీపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ గతంలో పలుమార్లు అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే..
2014 నవంబర్ 6న..
‘‘మా నాన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రప్రభుత్వం పదేపదే వేధిస్తోంది. రెండు రోజుల్లోనే నాన్నపై మూడు తప్పుడు కేసులు పెట్టారు. రౌడీషీట్ ఓపెన్ చేశారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు నాన్న గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. భూమా నాగిరెడ్డి గారి మీద ఇంతకు ముందు కేసులు లేవు. ఇప్పుడు ఒక్క సంఘటనలో మూడు కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేశారు. అమ్మ పోయిన షాక్‌లో నుంచి మేమింకా బయటకు కూడా రాలేదు. ఆయన్ని మెంటల్‌గా ఇంకా వీక్ చేయాలని కేసులు పెడుతున్నారేమో.. మీరు ఆయన్ని ఎంతైతే వెనక్కి లాగాలని చూస్తారో ఆయన అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ బలపడతారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి గారు ఓపెన్‌గా మీడియాకు చెబుతున్నారు. నంద్యాలకు బై ఎలక్షన్స్ వస్తాయి. భూమా నాగిరెడ్డిపై కేసులు ఎలా పెట్టాలో మాకు, మా నాయకుని(సీఎం చంద్రబాబు)కి తెలుసు. అంత ఓపెన్‌గా వాళ్లు నంద్యాలకు బై ఎలక్షన్స్ వస్తాయని ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకు తెలియడం లేదు. దాని వెనుక చంద్రబాబు సపోర్టు కూడా ఉందని ఓపెన్‌గా మీడియాకే చెబుతున్నారు. నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా.. భూమా నాగిరెడ్డి గారికి గానీ, నా కుటుంబానికి గానీ ఏమైనా జరిగితే దానికి బాధ్యత చంద్రబాబే అవుతారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకుండా వీళ్లు ఇంత ఓపెన్‌గా బైఎలక్షన్స్ వస్తాయి. కేసులు పెడతాం అని అనరు..
2015 జూలై 4న...
‘‘బైపాస్ సర్జరీ చేయించుకున్న నాన్నకు మధుమేహం, రక్తపోటు ఉంది. అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌లోని ‘నిమ్స్’కు తరలించడాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్‌జైలుకు పంపి, వారి నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామనడం సరికాదు. ఆ బృందంలో హృద్రోగ నిపుణులు లేరు. మమ్మల్ని వేధిస్తున్న ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. ఓటుకు కోట్ల వ్యవహారంలో ప్రమేయమున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వెన్నునొప్పి ఉందనే కారణంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. నాన్నకు హృద్రోగం, మధుమేహం, రక్తపోటు ఉన్నా నిమ్స్‌కు తరలించడానికి అభ్యంతరం ఏమిటి? ఒక పధకం ప్రకారం నాన్నను ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో ఇరికించారు..’’