సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యం లో జీతాలు రాకపోవడంతో ప్రభుత్యోద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేకపోతున్నారు. ఉద్యమం ప్రారంభమై 50 రోజులు దాటింది. ఉద్యమం ఎప్పుడు ముగుస్తుందో చెప్పడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఏదో విధంగా కుటుంబాలను నెట్టుకొచ్చిన ప్రభుత్వశాఖల్లో పనిచేసే గుమాస్తాలు, అటెండర్లు, స్వీపర్లు రుణాలు ఎక్కడ దొరుకుతాయా? అని ఎదురు చూపులు చూస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీవ్యాపారస్తులు తమ హవాను ప్రదర్శిస్తున్నారు.
అమాంతం పెంచిన వడ్డీ...
ఆర్టీసీ, నగరపాలకసంస్థ, రవాణాశాఖ, రెవెన్యూ తదితర విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వడ్డీలకు అప్పులు ఇచ్చేందుకు వడ్డీవ్యాపారస్తులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆయా కార్యాలయాల వద్దనే వారు మకాం వేసి రుణాలివ్వడం, జీతాలు రాగానే వడ్డీ వసూలు చేయడం చేస్తూ ఉంటారు. తాకట్టు కింద రుణగ్రస్తుడి బ్యాంకు పాస్‌బుక్, ఏటీఎం కార్డులు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం సొమ్ము అడిగే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో వీటితో పాటు ఖాళీ ప్రోనోట్స్ మీద సంతకాలు, తోటి ఉద్యోగస్తులతో హామీలు ఇప్పించమని డిమాండ్ చేస్తున్నట్లు ప్రభుత్యోద్యోగులు చెబుతున్నారు.
సాధారణంగా నూటికీ మూడు నుంచి నాలుగు రూపాయల వడ్డీ వసూలు చెల్లించేవారమని, ఇప్పుడు రూ. 6 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారని నగరపాలకసంస్థకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని కార్మికులు కొంతమంది కార్మికులు ‘సాక్షి’ వద్ద వాపోయారు. అదేమని ప్రశ్నిస్తే ‘సమ్మె ఆగిపోయి మీ జీతాలు వచ్చేస్తే మా రుణం తీర్చేస్తారు... అప్పుడు మాకు నష్టమే కదా?’ అని వడ్డీవ్యాపారస్తులంటున్నారని చెబుతున్నారు. ఎప్పుడూ అప్పు తీసుకునేవారికి మాత్రం వడ్డీలో కొంత రాయితీ ఇస్తున్నట్లు సమాచారం.
పోలీసుల నిఘా అవసరం...
ప్రభుత్యోద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల నిఘా అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నగరపాలకసంస్థ, ఆర్టీసీ వంటి వేలాది మంది సిబ్బంది పనిచేసే చోట నిత్యం తిష్ట వేసే వడ్డీవ్యాపారస్తులపై వీరు దృష్టి సారించాల్సి ఉంది. నామమాత్రపు వడ్డీతో రుణాలు ఇప్పించాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు.
బ్యాంకుల్లో అడ్వాన్సుల కోసం ప్రయత్నాలు....
మరో పదిరోజుల్లో కొత్త నెల వస్తుండటంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వరంగ శాఖలో పనిచేసే గుమాస్తాలు, సూపరింటెండెంట్స్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతినెలా జీతం వచ్చే బ్యాంకుల్లోనే ఒక నెల జీతం అడ్వాన్స్ ఇవ్వాలని అర్జీలు పెడుతున్నారు. నగరంలోని కొన్ని ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ విధంగా కోరినట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి ఏ విధమైన సానుకూల స్పందన రాలేదు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు రుణాలిచ్చేందుకు సహకరించాలని జేఏసీ నేతలు కోరుతున్నారు. కొంతమంది సిబ్బంది తమ వద్ద ఉన్న బంగారం ఆభరణాలు, ఇతర సేవింగ్ సర్టిఫికెట్లను తనఖా పెట్టి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.
వడ్డీ వ్యాపారస్తులదే హవా!
Published Fri, Sep 27 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement
Advertisement