
సాక్షి, తిరుపతి: భార్య ఆనారోగ్యంతో ఉన్నా, సెలవు ఇవ్వలేదనే కారణంతో ఓ ఎస్‌ఐ ఆదివారం ఉద్యోగానికి రాజీనామా చేశారు. చెన్నై రాజా కీల్పాక్కం ప్రాంతానికి చెందిన భాస్కర్ (53) చిట్లపాక్కం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. మనలి పోలీస్‌స్టేషన్ నుంచి ఆయన మూడు నెలల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఆయన తరచూ సెలవులు తీసుకుంటున్నట్లు తెలిసింది. భార్యకు ఆరోగ్యం సరిగా లేదని ఆదివారం సాయంత్రం భాస్కర్ సెలవు అడిగారని సమాచారం. ఇందుకు పోలీసు ఇన్‌స్పెక్టర్ రమేష్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన భాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ ఇచ్చిన భాస్కర్‌ను అధికారులు పిలిపించి చర్చించారు.