కనులపండువగా అప్పన్న కల్యాణం
- ఘనంగా రథోత్సవం
- పరవశించిన భక్తజనం
- భారీ ఏర్పాట్లు
సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి సింహగిరిపై సందడి నెలకొంది. కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి ఉత్సవమూర్తులను అర్చకులు ఇక్కడి నృసింహ మండపంలోని కల్యాణ వేదికపై అధిష్టించారు.
మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, హవల్దార్ టి.పి.గోపాల్, అర్చకులు రమణమూర్తి, సీతారాం, గోపాలకృష్ణమాచార్యులు తది తరులు ఈ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు.
కల్యాణం... కమనీయం
సాయంత్రం 4 గంటల నుంచి ఆలయంలో కొ ట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి వద్ద పూజలు నిర్వహించిన పసుపు కొమ్ములను ముత్తైవులు శిరస్సుపై పెట్టుకుని బేడా ప్రదక్షిణ చేశారు.
సాయంత్రం 5 గంటల నుంచి స్వామికి ఆరాధనను విశేషంగా చేశారు.
రాత్రి 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణాన్ని ఘనంగా నిర్వహించారు. సమస్త దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని అందిస్తూ గరుడాళ్వార్ చిత్ర పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు.
రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడ వీధు ల్లో ఎదురు సన్నాహోత్సవాన్ని నిర్విహ ంచారు.
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు పల్లకీలో, శ్రీదేవి, భూదేవిలను ముత్యాల పల్లకీలో ఊరేగించారు. గాలిగోపురం వద్ద రథంపై అధిష్టించారు.
రథంలో ఉన్న స్వామిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు.
భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు.