సాక్షి, కడప : ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల సంకల్పం సడలలేదు. జోరు వానను సైతం లెక్క చేయకుండా అన్ని నియోజకవర్గాల్లో రిలే దీక్షలు చేపడుతూనే ఉన్నారు. సమైక్య ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. సమైక్య శంఖారావం సభకు నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు తరలివెళ్లినా దీక్షలను మాత్రం ఆపలేదు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్లలో కృష్ణ శారద విద్యార్థులు 17 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో అంబేద్కర్ నగర్ వైఎస్సార్‌సీపీ నాయకురాలు శారదమ్మ నేతృత్వంలో ఆరు మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. జమ్మలమడుగులో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు విజయకుమారి ఆధ్వర్యంలో 12మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. రాయచోటిలో వీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు 15మంది దీక్షలు చేపట్టారు. కమలాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు మెడికల్ స్టోర్ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 15మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పులివెందులలో డ్వాక్రా మహిళలు 30మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరు, కడప, రాయచోటిలో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి.