సాక్షి, కడప : మూడు రోజులుగా జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలు ఉద్యమాన్ని నీరుగార్చలేకపోయాయి. సమైక్యాంధ్రను సాధించి తీరాలన్న పట్టుదలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ఉద్యమంలో దూసుకుపోతున్నారు. జడివాన నిలువునా తడిపేస్తున్నా ఉద్యమ జెండానుమాత్రం వదలటం లేదు.
కడప నగరంలో ఒంటిమిట్ట మండల ఉపాధ్యాయులు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో కూర్చొన్నారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీపీపీలో 2758, ట్రాన్స్‌కోలో 613, ఏపీఎస్‌పీడీసీఎల్‌లో 2580 మంది కలిపి మొత్తం 5,954 మంది శాశ్వత, కాంట్రాక్టు విద్యుత్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. మూడు సెక్టార్లకు సంబంధించి ఒక సీఈతోపాటు 14 మంది ఎస్‌ఈ స్థాయి అధికారులు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఆర్టీపీపీలో అత్యవసర సేవల నిమిత్తం 50 మంది ఉద్యోగులను వినియోగిస్తున్నారు. కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం ఇంజినీరింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ ఉపాధ్యాయ జేఏసీ కడప ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ నారాయణరెడ్డి అధ్యక్షతన సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. రాయలసీమలో భారీ బహిరంగసభ, మిలియన్ మార్చ్, ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అలాగే సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన 14 యూనివర్శిటీలకు చెందిన విద్యార్థి జేఏసీ నాయకులు కడపలో సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించి చేపట్టే కార్యక్రమాలను ప్రకటించారు. జర్నలిస్టులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, విద్యుత్, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
జమ్మలమడుగులో సమైక్యాంధ్ర సాధన కోసం గ్రామాలలో వినూత్నంగా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగులు గేటు వద్ద బైఠాయించి తమ నిరసన తెలియజేశారు.
పులివెందులలో సమైక్యాంధ్ర జేఏసీ, ఎన్జీఓలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఇడుపులపాయలో 7500 మంది ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి, ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడ్డారు.
మైదుకూరులో పెయింట్ షాపుల యజమానులు, వర్కర్లు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. న్యాయవాదులు, మెకానిక్‌లు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. దువ్వూరులో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రొద్దుటూరులో పెద్దమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు,న్యాయవాదులు, వైద్యుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గణనాథులను పట్టణంలో ఊరేగిస్తూ సమైక్య నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారు.
రాయచోటిలో జూనియర్ కళాశాలల కరస్పాండెంట్లు, న్యాయవాదుల రిలే దీక్షలు కొనసాగాయి. ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్నంగా చెట్ల కొమ్మలు, ఆకులు పట్టుకుని ఆదిమానవుని వలే వినూత్న ర్యాలీ నిర్వహించారు. కరెంటు మోటారు మెకానిక్‌ల ర్యాలీ కొనసాగింది. సుండుపల్లెలో వేలాదిమందితో చేపట్టిన సింహగర్జన సక్సెస్ అయింది.
రైల్వేకోడూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి టోల్‌గేట్ సమీపంలో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ధర్నాను విరమించాలని కోరడంతో జేఏసీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాజంపేట పట్టణంలో తొగట వీర క్షత్రియులు దండు శంకర్, రామచంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నేత వెంకట్రావు నేతృత్వంలో పెద్ద కారెంపల్లెకు చెందిన 70 మంది పురుషులు, మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలులో బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు, పెన్షనర్లు సంఘీభావం తెలిపారు. కలసపాడులో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపైనే వైద్య సేవలు అందించారు.
కమలాపురంలో పాపాఘ్ని నదిలో విద్యార్థి సంఘాలు, రైతు సంఘాల నాయకులు నీళ్లలో నిలబడి సమైక్య నినాదాలు చేశారు.
ఆగని పోరు
Published Fri, Sep 13 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement