2 ఏళ్లు.. శాతం పనులు
మాచవరం : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాల్వలు నాలుగు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారాయి. పాతికవేల ఎకరాలకు సాగునీరందించే ఆకురాజుపల్లి మేజర్ కాల్వ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. డ్రాప్టులు, బాయిలర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. పిచ్చి మొక్కలు, రబ్బరుచెట్లు మొలిచి చిట్టడవిని తలపిస్తున్నాయి.
అవి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో చివరి భూములకు నీరు చేర డం లేదు. నాలుగేళ్లుగా నీరు అందక రైతులు సక్రమంగా పంటలు పండించుకోలేకపోతున్నారు. కేవలం వర్షం ఆధారంగా పంటలు పండించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాలువలను బాగు చేసేందుకు నిధులు భారీగా మంజూరైనప్పటికీ కాంట్రాక్టర్ల సాగతీత ధోరణి కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.
పది కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన పనులు రెండేళ్లుగా రెండుశాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఆకురాజుపల్లి మేజర్ ద్వారా మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, బెల్లంకొండ మండలాల పరిధిలోని గ్రామాలకు సాగునీరు అందుతుంది. 21.78 కిలోమీటర్ల మేర ఉన్న ఈ కాల్వలకు మరమ్మతులు చేపట్టడం కోసం రెండేళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నుంచి రూ.10.08 కోట్ల నిధులు మంజూర య్యాయి. కాంట్రాక్టర్లకు
పనులు అప్పగించి 50 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించి, పనులు 2012 మేలో ప్రారంభించారు.
ఇప్పటివరకు కెనాల్ పరిధిలో 6వ మైలు, 8వ మైలు వద్ద రెండు సిమెంట్ డ్రాప్టులను నిర్మించారు. గడిచిన 24 నెలల కాలంలో రెండు శాతం పనులు మాత్రమే జరిగినట్లు ఎన్‌ఎస్‌పీ అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలిన 26 నెలల్లో 98 శాతం పనులు ఎలా పూర్తి చేస్తారో కాంట్రాక్టర్లకు, అధికారులకే తెలియాలి. కనీసం ఖరీఫ్‌లోనైనా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
సకాలంలో పూర్తి చేయిస్తాం..
ప్రపంచ బ్యాంకు నిధులతో రెండేళ్లుగా కాల్వల మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది పనుల్లో కొంత జాప్యం జరిగింది. ఎగువ నుంచి వరుసగా పనులు చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది మంగాపురం క్యాంపు వద్ద పెద్ద డ్రాప్టుల మరమ్మతులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 శాతం పనులు జరిగాయి. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు పలుమార్లు నోటీసులు కూడా పంపించాం. సకాలంలోనే పనులన్నింటినీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.
- చరియన్, ఇరిగేషన్ డీఈ