నిధులకే ‘టెండర్’!
►పంచాయతీరాజ్ ఇంజినీర్ల మరో బాగోతం
►కాంట్రాక్టర్లను ఎంపిక చేయాల్సింది పోయి.. నిధులివ్వాలంటూ మెలిక
►ఫలితంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు
►అధికారుల తీరుపై అనేక అనుమానాలు
రంగారెడ్డి జిల్లా : గ్రామ పంచాయతీల నిర్మాణ పనులకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేయండంటూ జిల్లా పంచాయతీశాఖ.. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని కోరింది. కానీ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఏం చేసిందో తెలుసా.. కాంట్రాక్టర్ల ఎంపికను అటుంచి, భవన నిర్మాణాల కోసం వచ్చిన నిధులకే టెండర్ పెట్టింది. ఆ కథేంటో చూడండి మరి.
జిల్లాలో 13 మండలాల్లోని 28 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రాజీవ్ గాంధీ పంచాయత్ స్వశక్తికరణ్ అభియాన్ (ఆర్‌జీపీఎస్‌ఏ) కింద నూతన భవనాలు మంజూరు చేసింది. ఇందుకు ఒక్కో భవనానికి రూ.12లక్షల చొప్పున మొత్తం రూ. 3.36కోట్లు కేటాయించింది. తొలివిడత రూ.1.68కోట్లు జిల్లా పంచాయతీ శాఖ (డీపీఓ) ఖాతాకు బదలాయించింది.
పనులు చేపట్టిన తర్వాత మలివిడతలో మిగతా నిధులు ఇస్తామని సూచించింది. దీంతో జిల్లా పంచాయతీ శాఖ అధికారులు కొత్త భవనాల నిర్మాణాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను గుర్తించాలంటూ జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని కోరుతూ గతేడాది డిసెంబర్ 24న లేఖ రాసింది.
కాంట్రాక్టర్లు ఓకే.. నిధులివ్వండి
డీపీఓ లేఖకు స్పందించిన పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీరు.. కాంట్రాక్టర్లను గుర్తించామంటూ తిరుగులేఖ రాశారు.‘కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తారు. వెంటనే మీ ఖాతాలో ఉన్న నిధులను మాకివ్వండి’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి కాంట్రాక్టర్లను మాత్రమే ఎంపిక చేయాల్సిన పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు.. కొత్తగా నిధులు బదలాయించమంటూ లేఖ పంపింది. దీంతో పంచాయతీ అధికారులు అవాక్కయ్యారు. ఈక్రమంలో తిరుగులేఖకు స్పందిస్తూ.. జిల్లా పంచాయతీ శాఖ జనవరి 12న మరోలేఖ రాసింది.
నిధులు సరే.. వివరణ ఇవ్వండి
పంచాయతీరాాజ్ ఎస్‌ఈ లేఖకు స్పం దిస్తూ పంచాయతీశాఖ మరో లేఖ పం పింది. ‘భవననిర్మాణాలకు కాంట్రాక్ట ర్లు ఎంపిక చేశారు. దీంతో ఆయా పం చాయతీ కార్యాలయఅధికారుల్ని కొం దరు కాంట్రాక్టర్లు సంప్రదిస్తున్నారు. కానీ నిధులు ఎలా ఇవ్వాలో వివరణ ఇవ్వాలి’ అంటూ మరోలేఖ సమర్పిం చింది. కానీ ఈ లేఖకు ఆ శాఖ బదులివ్వకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
పనుల నిర్మాణాలకు సంబంధించి వచ్చిన నిధులు డీపీఓ నేరుగా పంచాయతీ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఉమ్మడి ఖాతాలో జమచేయాలి. కానీ పనులు ప్రారంభించకముందే నిధులివ్వాలంటూ ఇంజినీరిం గ్ అధికారులు లేఖరాయడంలో అంతర్యమేమిటోనని పంచాయతీ అధికారు లు అనువనాలు వ్యక్తం చేస్తున్నారు.