రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య సోమవారం కీలక సమావేశం జరగనుంది.
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య సోమవారం కీలక సమావేశం జరగనుంది. సింగపూర్ ప్రభుత్వాన్ని రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు గత నెల సింగపూర్ పర్యటనలో కోరారు. దీనిపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి కనబరచడమే కాకుండా ఈ నెల 4న ఒక ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్ పంపింది. ఇక్కడ అధికారులతో ఆ బృందం సమావేశమై రాజధాని ప్రాంతానికి సంబంధించిన వివరాలతో పాటు మ్యాప్‌లను కూడా తీసుకువెళ్లింది.
మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సింగపూర్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని అంశాల్లో వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాల్లో ఆ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ క్రమంలో సోమవారం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అవగాహన ఒప్పందం జరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ మంత్రి వెంట రాజధాని నిర్మాణాల్లో నిష్ణాతులైన కంపెనీల ప్రతినిధులు కూడా రానున్నారని చెప్పారు. అలాగే సీఎం జపాన్ పర్యటన అనంతరం అక్కడి సంస్థలు రాజధాని నిర్మాణంలో సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.