Eshwaran
-
ఎన్నికల ముందు ‘రాజధాని’ సినిమా
సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం పేరుతో ఇన్నాళ్లూ తాత్కాలిక నిర్మాణాలతో కాలక్షేపం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు మరో డ్రామాకు తెరతీసింది. ఇందుకు ఇటీవల సింగపూర్‌లో రిహార్సల్స్ చేశారు. స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్రప్రభుత్వం కారుచౌకగా 1,691 ఎకరాలను రాసిచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ భూమిలో నాలుగున్నరేళ్లుగా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదు. తాజాగా స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భాగంగా ఎన్నికల ముందు ప్రజలను కనికట్టు చేసే ఎత్తుగడ ప్రారంభిస్తున్నారు. ప్రజల్లో భ్రమలు కల్పించడమే లక్ష్యం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో వెల్కమ్ గ్యాలరీ అంటూ కొత్త ఎగ్జిబిషన్‌ను తెరపైకి తెచ్చారు. ఈ వెల్కమ్ గ్యాలరీ నిర్మాణానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. వెల్కమ్ గ్యాలరీ అంటే సెట్టింగ్‌లతో రాజధాని ఊహాచిత్రాన్ని చూపించడమే తప్ప మరొకటి కాదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల ముందు మూడు నెలల్లోగా ఈ సెట్టింగ్‌లతో కూడిన రాజధాని ఊహాచిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. దీనిద్వారా రాజధానిలో ఏదో అద్భుతం జరగిబోతోందని ప్రజల్లో భ్రమలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు అంటున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల బొమ్మలు, చిత్రాలను వెల్కమ్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం ఆ భూములతో వ్యాపారం చేసుకోవడంపై అంతులేని శ్రద్ధ చూపుతుండడం గమనార్హం. రెండు హెక్టార్లలో 4,000 చదరపు మీటర్లలో వెల్కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. ఇందుకోసం ఇటీవల సింగపూర్‌లో జరిగిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశంలో కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. గ్యాలరీ డిజైన్ రూపకల్పన కోసం వీటీపీ కాస్ట్ అడ్వయిజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజుగా ప్రాజెక్టు వ్యయంలో 0.95 శాతం ఇవ్వాలని నిర్ణయించారు. అంటే కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.42.48 లక్షలు ఇస్తారు. వెల్కమ్ గ్యాలరీ సెట్టింగ్‌ల నిర్మాణ వ్యయం రూ.44.50 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రేపే సంయుక్త అమలు స్టీరింగ్ కమిటీ భేటీ సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర అధికారుల నాలుగో సంయుక్త అమలు స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరగనుంది. ఏపీ–సింగపూర్ మధ్య బిజినెస్ వ్యవహారాలతోపాటు ఇన్నొవేషన్ కారిడార్, సంయుక్త ఆర్థిక ప్రణాళిక, లాజిస్టిక్ అండ్ టూరిజం రంగం, మేనేజింగ్ పబ్లిక్ ఫీడ్‌బ్యాక్, ఎయిర్ కనెక్టివిటీ, సింగపూర్ విద్యార్థులు అమరావతికి రావడం, ఏపీ విద్యార్థుల సింగపూర్ పర్యటన పురోగతి నివేదికలపై చర్చించనున్నారు. -
చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
-
చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్‌ను ఈశ్వరన్ సమర్పించారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. రాజధాని మాస్టర్ ప్లాన్‌పై కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబుతో పాటు సింగపూర్ ప్రతినిధులు పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఈ రాజధాని హైలెవల్ కమిటీ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశంలో మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు సమీప గ్రామాల్లో భూములను ఏపీ సర్కార్ కేటాయించనుంది. అలాగే మాస్టర్ ప్లాన్‌పై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించనుంది. -
నేడు సర్కారుకు రాజధాని మాస్టర్‌ప్లాన్
* హైదరాబాద్ చేరిన సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ * నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఉన్నతస్థాయి భేటీ * అభ్యంతరాలు వెలిబుచ్చేందుకు నెలరోజుల గడువిచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందనుంది. ఈ మాస్టర్‌ప్లాన్‌ను తీసుకుని సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈశ్వరన్, ఆయనతోపాటు వచ్చిన సింగపూర్ కంపెనీల ప్రతినిధులు రాత్రికి ప్రైవేట్ హోటల్లో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సచివాలయంలో ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలసి ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ కేపిటిల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను ఏపీ సీఎంకు సమర్పిస్తారు. ఆ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. సోమవారం కేపిటల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించనుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ సమర్పించిన సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికపై రాష్ట్రప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని, అందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సివస్తే సూచిస్తుందని, అందుకు అనుగుణంగా మార్పులు చేశాకనే సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను ప్రజల ముందుంచుతామని పరకాల తెలిపారు. కేపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను సమర్పించడంతో ఇక స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేశాక ఆ మాస్టర్ డెవలపర్ వివిధ కంపెనీల నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా పెట్టుబడులను తీసుకువస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో కంపెనీలు పనిచేస్తాయని పరకాల చెప్పారు. ఇక సింగపూర్ సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఈశ్వరన్‌లు ఉన్నతస్థాయి సమావేశానంతరం విలేకరులతో మాట్లాడతారన్నారు. కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌కు తుది రూపమిచ్చాక దానిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం నోటిఫై చేయనుంది. నోటిఫై చేసిన తేదీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నెల రోజులపాటు సమయమివ్వనున్నారు. ఇరువురు నేతల మధ్య ప్రైవేట్ భేటీ ఇదిలా ఉండగా సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సోమవారం ప్రైవేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో వారిద్దరే ఉంటారు. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ బాధ్యతలను కూడా సింగపూర్ సంస్థలకే అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఈశ్వరన్ ప్రైవేట్ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఈ భేటీలో ఎటువంటి రహస్య అవగాహనలు చేసుకుంటారో ఎవరికీ తెలియదు. వారిద్దరి మధ్య మాత్రమే ఆ రహస్య భేటీ వ్యవహారాలు ఉంటాయి. -
ఏపీ సీఎంతో నేడు సింగపూర్ మంత్రి భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపకల్పన అంశంపై సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఈశ్వరన్, ఏపీ సీఎం చంద్రబాబుల మధ్య సోమవారం కీలక సమావేశం జరగనుంది. సింగపూర్ ప్రభుత్వాన్ని రాజధాని నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు గత నెల సింగపూర్ పర్యటనలో కోరారు. దీనిపై సింగపూర్ ప్రభుత్వం ఆసక్తి కనబరచడమే కాకుండా ఈ నెల 4న ఒక ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్ పంపింది. ఇక్కడ అధికారులతో ఆ బృందం సమావేశమై రాజధాని ప్రాంతానికి సంబంధించిన వివరాలతో పాటు మ్యాప్‌లను కూడా తీసుకువెళ్లింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సింగపూర్ ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని అంశాల్లో వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాల్లో ఆ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ క్రమంలో సోమవారం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే అవగాహన ఒప్పందం జరిగే అవకాశముందని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ మంత్రి వెంట రాజధాని నిర్మాణాల్లో నిష్ణాతులైన కంపెనీల ప్రతినిధులు కూడా రానున్నారని చెప్పారు. అలాగే సీఎం జపాన్ పర్యటన అనంతరం అక్కడి సంస్థలు రాజధాని నిర్మాణంలో సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.