
సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణం పేరుతో ఇన్నాళ్లూ తాత్కాలిక నిర్మాణాలతో కాలక్షేపం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల ముందు మరో డ్రామాకు తెరతీసింది. ఇందుకు ఇటీవల సింగపూర్‌లో రిహార్సల్స్ చేశారు. స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరిట సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్రప్రభుత్వం కారుచౌకగా 1,691 ఎకరాలను రాసిచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ భూమిలో నాలుగున్నరేళ్లుగా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదు. తాజాగా స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భాగంగా ఎన్నికల ముందు ప్రజలను కనికట్టు చేసే ఎత్తుగడ ప్రారంభిస్తున్నారు.
ప్రజల్లో భ్రమలు కల్పించడమే లక్ష్యం
అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో వెల్‌కమ్ గ్యాలరీ అంటూ కొత్త ఎగ్జిబిషన్‌ను తెరపైకి తెచ్చారు. ఈ వెల్‌కమ్ గ్యాలరీ నిర్మాణానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. వెల్‌కమ్ గ్యాలరీ అంటే సెట్టింగ్‌లతో రాజధాని ఊహాచిత్రాన్ని చూపించడమే తప్ప మరొకటి కాదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల ముందు మూడు నెలల్లోగా ఈ సెట్టింగ్‌లతో కూడిన రాజధాని ఊహాచిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. దీనిద్వారా రాజధానిలో ఏదో అద్భుతం జరగిబోతోందని ప్రజల్లో భ్రమలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు అంటున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల బొమ్మలు, చిత్రాలను వెల్‌కమ్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను గాలికొదిలేసిన ప్రభుత్వం ఆ భూములతో వ్యాపారం చేసుకోవడంపై అంతులేని శ్రద్ధ చూపుతుండడం గమనార్హం.
రెండు హెక్టార్లలో 4,000 చదరపు మీటర్లలో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. ఇందుకోసం ఇటీవల సింగపూర్‌లో జరిగిన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సమావేశంలో కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. గ్యాలరీ డిజైన్ రూపకల్పన కోసం వీటీపీ కాస్ట్ అడ్వయిజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజుగా ప్రాజెక్టు వ్యయంలో 0.95 శాతం ఇవ్వాలని నిర్ణయించారు. అంటే కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.42.48 లక్షలు ఇస్తారు. వెల్‌కమ్ గ్యాలరీ సెట్టింగ్‌ల నిర్మాణ వ్యయం రూ.44.50 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
రేపే సంయుక్త అమలు స్టీరింగ్ కమిటీ భేటీ
సింగపూర్ మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర అధికారుల నాలుగో సంయుక్త అమలు స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం సచివాలయంలో జరగనుంది. ఏపీ–సింగపూర్ మధ్య బిజినెస్ వ్యవహారాలతోపాటు ఇన్నొవేషన్ కారిడార్, సంయుక్త ఆర్థిక ప్రణాళిక, లాజిస్టిక్ అండ్ టూరిజం రంగం, మేనేజింగ్ పబ్లిక్ ఫీడ్‌బ్యాక్, ఎయిర్ కనెక్టివిటీ, సింగపూర్ విద్యార్థులు అమరావతికి రావడం, ఏపీ విద్యార్థుల సింగపూర్ పర్యటన పురోగతి నివేదికలపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment