
బేగంపేట విమానాశ్రయం నుంచి సింగపూర్ కు బయల్దేరుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, టీడీపీ ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
* పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా..
* మూడు రోజుల పాటు సింగపూర్‌లో ముఖ్యమంత్రి బృందం పర్యటన
* రాజధానికి సహకారం, పెట్టుబడుల ఆకర్షణ కోసమేనన్న మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట మంత్రులు, టీడీపీ ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన చంద్రబాబు రాత్రికి సింగపూర్ చేరుకున్నారు. జూన్ ఎనిమిదో తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు జరుపుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఆయన బుధ, గురు, శుక్రవారాల్లో సింగపూర్‌లో పర్యటించనున్నారు.
చంద్రబాబు వెంట సింగపూర్ వెళ్లిన వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, డాక్టర్ పి.నారాయణ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎ.ఆర్.అనూరాధ, సీఎం కార్యాలయ కార్యదర్శి ఎ.గిరిధర్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి డి.సాంబశివరావు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ, సీఎం ముఖ్య భద్రతాధికారి నగేష్‌బాబు, వ్యక్తిగత సహాయకుడు బి.రాజగోపాల్ ఉన్నారు.
సోమవారం సాధారణ పరిపాలన శాఖ సీఎం వెంట సింగపూర్ వెళ్లే వారి పేర్లతో ఒక జీవో జారీ చేసింది. అందులో సి.ఎం.రమేష్, అనూరాధల పేర్లు లేవు. మంగళవారం వారిద్దరు కూడా సీఎం వెంట వెళ్లే బృందంలో ఉన్నారంటూ మరో జీవోను సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసింది. తొలుత ఈ బృందంలో టీడీపీపీ నేత వై.సత్యనారాయణ (సుజనా)చౌదరి కూడా ఉండాలి. ఆయన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆఖరు నిమిషంలో పర్యటన నుంచి తప్పుకున్నారు.
చంద్రబాబు విదేశీ పర్యటన బృందంలో సభ్యులుగా ఉన్న మంత్రులు యనమల, నారాయణ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించటంతో పాటు నూతన రాజధాని నిర్మాణంలో ఆ దేశ సాయం తీసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. సింగపూర్ నుంచి రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ అధికారులు అంతర్జాతీయ సంస్థ ద్వారా ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను రూపొందింపచేశారు. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు అక్కడి పారిశ్రామకవేత్తలకు దీని ద్వారా వివరించనున్నారు.
బాబు పర్యటనలో పారిశ్రామికవేత్తలు...
సింగపూర్ పర్యటనకు బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబును భారీ సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు అనుసరించారు. సింగపూర్‌తో పాటు ఈ నెల 24 నుంచి జపాన్‌లో పర్యటనకు మొత్తం 46 మంది పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లను చంద్రబాబు ఆహ్వానించారు. ఇందులో భాగంగా చంద్రబాబు వెంట సింగపూర్ పర్యటనలో పాల్గొనేందుకు 18 మంది పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు మంగళవారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి మరో విమానంలో బయలుదేరి వెళ్లారు. సింగపూర్ వెళ్లిన వారిలో నవయుగ, జీఎంఆర్, ట్రాన్స్‌ట్రాయ్, కాకినాడ పోర్టు, శ్రీసిటీ, ఎల్ అండ్ టి, గంగవరం పోర్టు, మధుకాన్, అమర్ రాజా బ్యాటరీస్, రిత్విక్, జీవీకే తదితర సంస్థలకు చెందిన వారు ఉన్నట్లు పరిశ్రమలశాఖ వర్గాలు తెలిపాయి.