కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఉద్యమ పిడికిలి బిగుస్తోంది. సమైక్య సమ్మెకు సైరన్ మోగింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ సంఘాలు సమ్మెలోకి వెళ్లనుండటంతో ప్రభుత్వ కార్యకలాపాలతోపాటు పలు సేవల రంగాలు స్తంభించిపోనున్నాయి. సమ్మెల్లో పాల్గొంటున్న ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చిన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా వాడవాడలా హోరెత్తుతున్న ఉద్యమనాదం ఉద్యోగ సంఘాల సమ్మెతో పతాకస్థాయికి చేరనుంది. ఇప్పటికే గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కుల, మత, వర్ణ, వర్గ విభేదాలకు అతీతంగా విద్యార్ధులు, యువకులు, మహిళలు, వృద్ధులు సమైక్య ఉద్యమం సాగిస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయినా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ స్పం దించకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 12(సోమవారం) అర్ధరాత్రి నుంచి సమ్మెకు ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలకు చెందిన 20వేలకుపైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక(జేఏసీ) ప్రకటించింది.
సేవలకు విఘాతం
ప్రధానంగా రెవెన్యూ, మండలపరిషత్, ఇరిగేషన్, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖలు పూర్తిగా సమ్మెలో పాల్గొంటున్నారు. ఉపాధ్యాయ సంఘాల్లో రెండు, మూడు మినహా అన్ని సంఘాలు సమ్మెకు మద్దతునిస్తున్నాయి. ఫలితంగా మంగళవారం నుంచి వివిధ రకాల ప్రభుత్వ సేవలకు దూరం కానున్నాయి. ప్రభుత్వ పాలన పూర్తిగా పడకేస్తుంది. మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు సమ్మె చేయనుండటంతో పాఠశాలలు మూతపడనున్నాయి. పంచాయతీరాజ్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రామపరిపాలన స్తంభిస్తుంది. ట్రజరీ ఉద్యోగుల సమ్మె వల్ల వివిధ రకాల బిల్లులు, ఉద్యోగుల జీతాలు నిలిచిపోతాయి. నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖల సమ్మె వల్ల వ్యవసాయ రంగం ఇబ్బంది పడుతుంది. అయితే సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు అంటున్నారు.
సమ్మెలో పాల్గొనే శాఖలు
ఉపాధ్యాయులు
రెవెన్యూ శాఖ
వైద్య, ఆరోగ్యశాఖ మినిస్టీరియల్ సిబ్బంది
మండల పరిషత్
జిల్లా పరిషత్
నీటిపారుదల శాఖ
పే అండ్ అకౌంట్స్
రిజిస్ట్రేషన్స్
ఖజానా శాఖ
వాణిజ్య పన్నులు,
ఆర్టీసీ
విద్యుత్
మున్సిపాలిటీ
పశువైద్యం
వ్యవసాయం
ఉద్యానవన శాఖ
సమ్మె సైరన్
Published Mon, Aug 12 2013 3:00 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement