గోవిందా.. గోవిందా..? | SIT Officers negligence On 500 Crore Scam in Visakhapatnam | Sakshi
Sakshi News home page

గోవిందా.. గోవిందా..?

Published Sat, Nov 10 2018 6:58 AM | Last Updated on Sat, Nov 17 2018 1:46 PM

SIT Officers negligence On 500 Crore Scam in Visakhapatnam - Sakshi

రికార్డులు తారుమారైన స్థలాన్ని సిట్‌ ఆదేశాలతో తనిఖీలు చేస్తున్న రెవెన్యూ బృందం (ఫైల్‌)

అది ఏకంగా రూ.500 కోట్ల భూ కుంభకోణమని సిట్‌ నిర్థారించింది. సిట్‌ సూచన మేరకు గత ఏడాది జూలైలో అప్పటి ఆనందపురం తహసీల్దార్‌ ఫిర్యాదు చేయగా.. ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌లో అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.కానీ విచిత్రంగా భూ కుంభకోణాలపై సిట్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఆ కేసు ప్రస్తావనే లేకుండా పోయింది. సర్కారు ఆదేశాలతో సిట్టే తొలగించిందో.. లేక అధికార పార్టీ నేతల ప్రమేయమున్న అంశాలను సర్కారే నివేదిక నుంచి తొలగించిందో.. తెలియదు గానీ.. ఇంత పెద్ద భూ కుంభకోణం వెలుగు చూసినా.. కేసు నమోదైనా.. తుది నివేదికలో లేకపోవడం దాని విశ్వసనీయతపైనే అనుమానాలు రేకెత్తిస్తోంది.

విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఖాళీగా కనిపించిన స్థలాలు, భూములన్నింటినీ ట్యాంపరింగులు, ఫోర్టరీలు, తప్పుడు పత్రాలతో చెరబట్టేసిన అధికార టీడీపీ నేతల భూ దందాలు విశాఖలో బహిరంగ రహస్యమే అయినా.. సిట్‌కు వేలాది ఫిర్యాదులు ఆధారాలతో సహా వెల్లువెత్తినా.. ఏ ఒక్క టీడీపీ నేత పేరూ సిట్‌ నివేదికలో లేకపోవడం.. కేవలం అధికారుల పేర్లనే తెరపైకి తీసుకురావడం.. తమవారి ని రక్షించి.. ఎదుటివారిని బలి చేయడచనే సర్కారీ కుట్రలో భాగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విశాఖ సిటీ: సిట్‌.. చీట్‌ చేసింది. తమ భూముల రికార్డులు తారుమారై.. పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయంటూ గగ్గోలు పెట్టిన సామాన్యులు.. సిట్‌ ద్వారా న్యాయం జరుగుతుందేమోనని ఫిర్యాదులు చేశారు. తీరా ఆ బృందం కూడా.. ఆ తానులోని ముక్కేనని తుది నివేదికలో తేలిపోవడంతో అక్రమార్కుల కారణంగా భూములు కోల్పోయిన బాధితులు బావురుమంటున్నారు. విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటు చేసిన సిట్‌ విచారణలో అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రికార్డులు ట్యాంపరింగ్‌ చేసి రూ.500 కోట్ల విలువైన భూములను కబ్జా చేసినట్టుగా నిర్ధారణైంది. సిట్‌ ఆదేశాలతో ఆనందపురం తహసీల్దార్‌ కేవీ ఈశ్వరరావు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే పీలా గోవిందు, ఆయన కుటుంబ సభ్యులు సహా 11 మందిపై గతేడాది జూలై నెలలో ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే.. ప్రభుత్వం వెల్లడించిన తుది నివేదికలోఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ మాయమైపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గోవిందుడు ట్యాంపర్‌ చేసిన విధంబెట్టిదనిన..
ఆనందపురం మండలం రామవరం సర్వే నంబర్లు 126, 127, 128, 130/1ల్లో జమిందార్లయిన వెలుగోటి రాజగోపాలచంద్ర కుటుంబా నికి 48.55 ఎకరాల భూములున్నాయి. పూణేకు వలస పోయిన జమిందారు తన భూములకు సంరక్షణకునిగా> పాకలపాటి బైరాగి రాజుకు అప్పగించారు. అతని కుమారుడైన పాకలపాటి సత్యనారాయణరాజు వీఆర్‌వోగా పనిచేసిన సమయంలో ఆ భూములను తమ కుటుంబ సభ్యులు ఎస్‌ఎఫ్‌ఏలో ట్యాంపరింగ్‌ చేసి నమోదు చేశారు. వీటితోపాటు పక్కనే సర్వే నెం. 132/2లో ఉన్న మరో 47.34 ఎకరాలను కలిపి మొత్తం 95.89 ఎకరాలకు పాకలపాటి కుటుంబ సభ్యులు పట్టాదార్‌ పుస్తకాలు పుట్టించారు. వీటిని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యే పీలా గోవిందు 2007లో తనకు అనుకూలంగా వచ్చిన ఉన్న ఓ తహసీల్దార్‌ ద్వారా మొత్తం రికార్డులను ట్యాంపర్‌ చేసి తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. కొన్నేళ్ల తర్వాత జమిందారు కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని తమ భూములను పరిరక్షించుకునేందుకు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. భూ కుంభకోణాలపై ప్రభుత్వం సిట్‌ వేసిన విషయాన్ని తెలుసుకుని జమిందారు వెలుగోటి రాజగోపాల చంద్ర వారసుడు రాజా గోపాలకృష్ణ యాచేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిట్‌ బృందం లోతైన పరిశీలన చే యడం.. సిట్‌ ఆదేశాల మేరకు ఆనందపురం తహసీల్దార్‌ ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే పీలాతో సహా 11 మందిపై వివిధ సెక్షన్ల కింద ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మరి.. గోవిందుడు మనవాడేలే అంటూ.. చంద్రబాబు సర్కారు ఆ కేసుకు సంబంధించిన విషయాన్ని విస్మరించేలా సిట్‌కు ఆదేశాలు జారీ చేసినట్లుంది. అందుకే.. ఆ కేసుకి సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని సిట్‌ నివేదికలో పొందుపరచలేదని సమాచారం.

ఇలా.. అధికార పార్టీకి చెందిన నేతల ప్రమేయం ఉన్న ప్రతి భూ కబ్జా వ్యవహారాన్ని టీడీపీ ప్రభుత్వ ఆదేశాలతో సిట్‌ తొక్కిపెట్టేసింది. కేవలం అధికారులు, రెవిన్యూ సిబ్బంది మాత్రమే బలయ్యేలా.. ట్యాంపరింగ్‌ వ్యవహారంపై రిపోర్టులు తయారు చెయ్యడంపై అటు విపక్ష వర్గాలే కాదు.. అధికార వర్గాలూ మండిపడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ అధికారీ.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా ఇలాంటి పనులు చేసేందుకు సాహసించరనీ.. అలాంటప్పుడు అధికారులను మాత్రమే టార్గెట్‌ చెయ్యడం సరికాదంటూ పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.

దర్జాగా కబ్జా..ఆధారాలు గల్లంతు..
ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగానూ, లక్ష ఎకరాల ప్రభుత్వ భూములున్న జిల్లాగా పొందిన గుర్తింపే విశాఖ కొంపముంచింది. అంతర్జాతీయ సదస్సులు జరిగిన ప్రతిసారీ ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తామని బీరాలు పలికిన టీడీపీ.. భూమాఫియాతో పరువుని పాతాళానికి పడేశారు. విలువైన భూములు కనిపించడంతో.. కబ్జారాయుళ్లు తెగబడిపోయారు. రాజధాని తరహాలోనే భూదందా సాగించేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్ష ఎకరాల భూముల్ని మింగే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎక్కడా లేని విధంగా.. భూముల రికార్డులు ట్యాంపరింగ్‌కు గురిచేశారనీ.. ఆక్రమణదారుల చేతుల్లోకి ప్రభుత్వ భూములు వెళ్లిపోతున్నాయంటూ సాక్షాత్తూ కలెక్టర్‌ ప్రకటించడంతో జిల్లా ఉలిక్కిపడింది. చిన్నా చితకా కబ్జాలు మాత్రమే వెలుగులోకి వచ్చిన రోజులు పోయి.. వేలు, లక్షల ఎకరాల భూముల్ని దోచుకునే స్థితికి చేరుకుందంటే అదంతా అధికార పార్టీ దోపిడీగానే చెప్పుకోవచ్చు.

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు కుమ్మక్కై ఈ భూదందా సాగించినట్లుగా ఆధారాలు బట్టబయలయ్యా యి. ఆవు చేలో మేస్తే.. అన్న చందాన ప్రజాప్రతినిధుల అండదండలతో అధికారులు అవినీ తిలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. నీకిం త.. నాకింత.. అనే ధోరణిలో సాగిన భూకబ్జాలతో.. అధికారుల ఆస్తులు కోట్లకు పడగలెత్తుతున్నాయి. రికార్డుల ట్యాంపరింగ్‌తోపాటు రెవి న్యూ మ్యాపులు, ఇలా.. భూములకు సంబంధించిన ఆధారా>లన్నీ గల్లంతు చేసేశారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. చోడా నాయకులు.. ఇలా దొరికింది దొరికినట్లుగా దోచుకుంటున్నారు. భూదందాలు సృష్టించిన విలయంలో డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా అన్నీ ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అధికారం అడ్డం పెట్టుకొని అనుభవదారులపైనా, యజమానులపై సకల మాయోపాయాలు ప్రయోగించారు. అధికారులను పావులను చేస్తూ అడ్డగోలుగా.. కనిపించిన భూమి నల్లా కబ్జా చేసేసి జిల్లా పరువును బంగాళా ఖాతంలో కలిపేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement