మితిమీరిన బంధుప్రీతి, భూదాహంతో విశాఖ భూములను చెరబట్టి అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సాగించిన భూకబ్జాల నిగ్గు తేల్చి, దోషులపై చర్యలు తీసుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నడుం బిగించింది. వందల కోట్లలో సాగిన ఈ కుంభకోణాలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. వాస్తవానికి అప్పట్లోనే భూదందాలను సాక్షి వరుస కథనాలతో వెలుగులోకి తేవడం.. రచ్చ కావడంతో అప్పటి టీడీపీ సర్కారు సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. కానీ కబ్జాకాండల్లో పాత్రధారులు, సూత్రధారులందరూ తమ పార్టీవారే కావడంతో.. సిట్ సమర్పించిన నివేదికను అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టింది.కాగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి భూ కుంభకోణాలపై పక్కాగా విచారణ జరిపించి.. దోషులు, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వం.. తన మాటకు కట్టుబడి సిట్‌ను ఏర్పాటు చేసింది. ఇద్దరురిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఒక రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జితో కూడిన ఈ బృందం.. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై మూడు నెలల్లో సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ నగరం, సమీప మండలాలు, ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా భూ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అది ప్రభుత్వ స్థలమైనా.. ప్రైవేటు స్థలమైనా సరే.. కబ్జాదారులు తమ కబంధ హస్తాల్లోకి తీసుకునేవాళ్లు. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా దేన్నీ వదల్లేదు. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. కొందరు అధికారులు వారితో కుమ్మక్కు కాగా.. మరి కొందరి మెడపై అధికారమనే కత్తి పెట్టి పనులు చేయించుకున్నారు. ఇక రికార్డులు తారుమారు చేయడమనే సరికొత్త భూ దందాకు బహుశా దేశంలోనే మొదటిసారి ఇక్కడే బీజం పడిందన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో సాక్షిలో వరస కథనాలు రావడంతో ఎట్టకేలకు తెలుగుదేశం ప్రభుత్వం సిట్‌ను నియమించినప్పటికీ.. ఆ నివేదిక మాత్రం వెలుగు చూడలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ ప్రభుత్వం రాగానే.. ప్రజల నుంచి వచ్చిన వినతులు, విజ్ఞప్తుల మేరకు భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుంబాక విజయసాయిరెడ్డి విశాఖ వచ్చిన సందర్భంలో కూడా.. మరో సిట్ ను నియమించి ఈసారి పక్కాగా విచారణ చేపట్టి.. అక్రమార్కుల అంతుతేలుస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.
సిట్ చీఫ్‌గా డా. విజయ్‌కుమార్..
రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్ అధికారి డా.విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. సిట్ బృందం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని నిర్దేశించింది. సభ్యులుగా అవసరమైతే అర్హులైన వారిని నియమించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం గురువారం రాత్రి జీవోని విడుదల చేశారు.
విధులు.. అధికారాలు..
-సిట్ బృందానికి ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు, వెబ్‌ల్యాండ్ ఖాతాలను నిశితంగా పరిశీలించే అధికారం ఉంటుంది.
-మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూముల రికార్డులను.. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించే అధికారం ఉంది.
-ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయన్నదానిపై కమిటీ విచారణ జరుపుతుంది.
- రికార్డుల ట్యాంపరింగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతారు.
-భూ వివాదాలు, ఆరోపణలకు సంబంధించి ఏ అధికారినైనా, ఏ వ్యక్తినైనా పిలిచి విచారించే అధికారం సిట్‌కు ఉంది.
-ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తుంది.
-జిల్లా అధికారులు సిట్‌కు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
-సిట్ బృందానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించింది.
అక్రమార్కులను వదిలిపెట్టం : ముత్తంశెట్టి
అల్లిపురం(విశాఖ దక్షిణం): భూ ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం కొత్తగా సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన సిట్ భూ ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించినా.. సకాలంలో రిపోర్టును బహిర్గతం చేయలేదన్నారు. భూకబ్జాదారులకు కొమ్ము కాయటమే కాకుండా భూకబ్జాలకు పాల్పడిన టీడీపీ నాయకులను రక్షించుకునేందుకు సిట్ నివేదికను బుట్టదాఖలా చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్‌విజయకుమార్, వై.వి.అనురాధ, విశ్రాంత జిల్లా సెషన్స్ జడ్జి టి.భాస్కరరావులతో కూడిన సిట్ మూడు నెలల పాటు పనిచేస్తుందని తెలిపారు. బాధితులు సిట్ సభ్యులను కలసి వివరాలు అందజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment