అనంతపురం జిల్లా /ఎస్కేయూ: శ్రీకృష్ణ విద్యాలయం (ఎస్కేయూ) హాస్టల్‌లో లక్ష్మీప్రసన్న (23) అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఇందుకు దారి తీసిన కారణాలు ఏమిటనేది తెలియడం లేదు.
వివరాలిలా ఉన్నాయి. గోరంట్లకు చెందిన నాగరాజు, జయమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీప్రసన్న ఎస్కేయూ సైన్స్ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ (జువాలజీ) చదువుతోంది. గోదావరి హాస్టల్‌లో ఉంటోంది. సోమవారం ఉదయం 11 గంటలకు తరగతి గది నుంచి హాస్టల్ గదికి వచ్చింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు వచ్చి తలుపు తట్టగా లోపలి నుంచి స్పందన రాలేదు. వెంటనే వారు హాస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు పోలీసుల సాయంతో తలుపులు పగులగొట్టారు. లోనికెళ్లి చూడగా లక్ష్మీప్రసన్న ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు తేజోనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్‌ఐ అబ్దుల్ కరీం తెలిపారు. తోటి విద్యార్థులను, స్నేహితులను ఆరా తీస్తున్నారు. లైంగిక వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిందా అనే అంశంపై లక్ష్మీ ప్రసన్న కాల్ డేటా దర్యాప్తునకు కీలకం కానుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
దురదృష్టకరం
ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు గోదావరి హాస్టల్‌ను సందర్శించారు. లక్ష్మీప్రసన్న ఉరి వేసుకొన్న ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కొట్టొచ్చిన భద్రతా వైఫల్యం..
విద్యార్థులకు రక్షణ కల్పించే విషయంలో వర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి హాస్టల్‌లోనూ సీసీ కెమరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను గాలికొదిలేశారు. హాస్టల్ అధికారుల పర్యవేక్షణే గనుక ఉండి ఉంటే నేడు విద్యార్థినిని కోల్పోవాల్సి వచ్చేది కాదని తోటి విద్యార్థులు వాపోతున్నారు. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. అదనపు బాధ్యతలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన డిప్యూటీ వార్డెన్ పోస్టులను భర్తీ చేస్తే.. ఇలాంటి ఘటనలను ముందుగా పసిగట్టే అవకాశం ఉంటుందనే భావన వ్యకతమవుతోంది.
నేడు ఎస్కే యూనివర్సిటీ బంద్
ఎమ్మెస్సీ విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న మృతికి సంతాప సూచికంగా మంగళవారం ఎస్కే యూనివర్సిటీని బంద్ చేస్తున్నట్లు విద్యార్థి జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు వెలికితీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడతామని పేర్కొంది.
ఆత్మహత్య చేసుకునే సమస్యలు లేవు
లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మా కుటుంబంలో లేవు. జువాలజీ విభాగంలో ఒక ఫ్యాకల్టీ మెంబర్ కారణంగా తరచూ భయపడేది. ఇందులో హాస్టల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. చనిపోయిన విషయం మాకు తెలపకుండానే మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
– మీడియాతో లక్ష్మీ ప్రసన్న సోదరుడు తేజోనాథ్.
అన్ని కోణాల్లో దర్యాప్తు
విద్యార్థిని మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తాం. హాస్టల్‌లో ఉన్న సమస్యలతో పాటు అనుమానాస్పద మృతి అని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటాం.
– వెంకట్రావు, అనంతపురం డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment