విశాఖపట్నం: స్మగ్లర్లు భారీగా గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అకస్మాత్తుగా వాహనం నిలిచిపోయింది. వాహనాన్ని బాగు చేసేందుకు సమయం లేదు. ఓ వేళ వాహనం బాగు చేసే క్రమంలో పోలీసులు వస్తే అందరం దొరికిపోతామని భావించినట్లు ఉన్నారు. అంతే గంజాయితోపాటు వాహనాన్ని పెట్రోల్ పోసి తగలుబెట్టి అక్కడి నుంచి పరారైయ్యారు.
దాంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పివేసి... జీపులోని 30 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన కారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరంలోని పెద్దగుమ్మలూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.